Homeజాతీయ వార్తలుNagam Janardhan Reddy: పాపం నాగం.. పరిస్థితులను అంచనా వేయలేక ఆగం..

Nagam Janardhan Reddy: పాపం నాగం.. పరిస్థితులను అంచనా వేయలేక ఆగం..

Nagam Janardhan Reddy: కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుందని ఒక సామెత. రాజకీయాల్లో కూడా ఈ సామెత వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏలుతున్న కాలంలో తూళ్ళ దేవేందర్ గౌడ్ హోం శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. కాలం గడిచిన తర్వాత ఆయన ఇప్పుడు తన ఇంటికే పరిమితం అయిపోయారు. నాగం జనార్దన్ రెడ్డి కూడా అప్పట్లో చక్రం తిప్పిన వాడే. కానీ పరిస్థితులు కలిసి రాక ఇప్పుడు ఆగమాగం అయిపోతున్నాడు. నాగం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓ పిల్ల బచ్చా లాగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానయి వ్యవహరిస్తున్నాడు. ఇద్దరూ ఉమ్మడి మహ బూబ్ నగర్ జిల్లాకు చెందినవారైనప్పటికీ.. రాజకీయాల్లో ఎంత తేడా? ఎక్కడి నాగం, ఎక్కడి రేవంత్?

2023 సాధారణ ఎన్నికలకు ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది.. ఇందులో కొడంగల్ తర్వాత అత్యంత ఆసక్తికరంగా అనిపించింది నాగర్ కర్నూల్ నియోజకవర్గం పేరు. అందులో నాగం జనార్దన్ రెడ్డి పేరుకు బదులుగా రాజేష్ రెడ్డి అనే పేరు కనిపించగానే ఒక్కసారిగా ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా వారు ఒకప్పటి సంఘటనలను గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించారు. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి చక్రం తిప్పేవారు. ఇప్పుడు రాజకీయ జీవితం వారిది ముగింపుకు వచ్చినట్టు కనిపిస్తోంది. దేవేందర్ గౌడ్ ఇంటిపట్టున ఉంటుండగా.. నాగం జనార్దన్ రెడ్డి పరిస్థితి మాత్రం జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా మారిపోయింది. నాగం జనార్దన్ రెడ్డి టిడిపిలో ఒక వెలుగు వెలుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక సాధారణ కార్యకర్త. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అప్పటికి నాగం జనార్దన్ రెడ్డి టిడిపిలో నెంబర్ _2 గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ధ్వజమెత్తారు. అప్పటికి తెలుగుదేశం పార్టీలో తన స్థానానికి డోకా లేదు అనుకున్నారు. కోదండ రామ్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత.. ఒకరోజు నాగం..తెలంగాణ రెడ్డి నాయకుడిగా కోదండరాం ఎదిగిపోతున్నారని కంగారు పడ్డారు. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో చంద్రబాబును వ్యతిరేకించినట్లు మాట్లాడి.. సంచలనం రేకెత్తించారు. సభలో విడిగా కూర్చొని.. ఆ తర్వాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే.. జిల్లాకు చెందిన మరో నేత.. తిరుగుబాటు చేస్తున్న వారు అలానే విడిగా ఉండాల్సింది, బాబు పక్కన కూర్చోగానే నాగం పని అయిపోయింది, అది ఆయనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

టిడిపిలో నాగం జనార్దన్ రెడ్డి ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు కేసీఆర్ ఎక్కడో ఉన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత.. తెలంగాణ ఉద్యమాన్ని తన కను సన్నల్లో ఉంచుకున్న తర్వాత ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలో తెలియక నాగం జనార్దన్ రెడ్డి అటువైపు వెళ్ళలేదు. మరో వైపు నాగం సామాజిక వర్గానికి చెందిన కోదండరాం తెలంగాణ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేశారు. ఎందుకైనా మంచిదని అందులోకి వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి బిజెపికి, బిజెపి లోనుంచి కాంగ్రెస్లోకి నాగం జనార్దన్ రెడ్డి వెళ్లిపోయారు. టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. తను ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక సాధారణ కార్యకర్త అయిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ.. తన టికెట్ మీద నాగం జనార్దన్ రెడ్డి అలాగే ఆశలు పెట్టుకున్నారు. అప్పట్లో కెసిఆర్ కింద పని చేయడానికి ఒప్పుకోని నాగం జనార్దన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి కింద పనిచేసేందుకు మాత్రం ఎటువంటి ఇబ్బందీ పడలేదు.. రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చే స్థానంలో ఉండగా.. నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశించే స్థానంలోనే ఉన్నారు. అయిప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. అందుకే అంటారు ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. మరీ ముఖ్యంగా ఇది రాజకీయాల్లో ఇవి రిపీట్ అవుతూనే ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular