T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ మినహా ఇప్పటివరకు మిగతా పెద్దజట్లేవీ బరిలోకి దిగలేదు. పెద్ద జట్లు ఇంకా ఆడక పోవడంతో చాలామంది టి20 మ్యాచ్ లు పెద్దగా చూడడం లేదు. అయితే అలాంటివారు ఒకవేళ t20 మ్యాచ్ లు చూడనట్టయితే.. సోమవారం ఒక సూపర్బ్ మ్యాచ్ మిస్ చేసుకున్నట్టే. ఎందుకంటే టి20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది ఒమన్ జట్టు. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న ఈ జట్టు.. సోమవారం బార్బడోస్ వేదికగా నమీబియాపై నువ్వా నేనా అన్నట్టుగా పోరాడింది. చివరికి సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది.. వెంట్రుకవాసిలో విజయాన్ని కోల్పోయినప్పటికీ ఒమన్ జట్టు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
బార్బోడోస్ వంటి స్లో పిచ్ పై సోమవారం నమీబియా, ఒమన్ దేశాల మధ్య సోమవారం లీగ్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఖలీద్ కైల్(34) టాప్ స్కోరర్ గా నిలిచాడు. నమీబియా బౌలర్లు ట్రంపెల్మన్ 4/21, డేవిడ్ వైసే 3/28 సత్తా చాటారు.
110 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయడంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. విజయానికి చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన క్రమంలో నమీబియా ఒక పరుగు మాత్రమే చేసి మ్యాచ్ ను టై గా ముగించుకుంది.. నమీబియా ఆటగాళ్లల్లో జెన్ ఫై లింక్ (45) మాత్రమే పోరాడాడు. ఒమన్ బౌలర్ మోహరాన్ ఖాన్ 3/7 అదరగొట్టాడు.
ఇక సూపర్ ఓవర్ లో నమీబియా అదరగొట్టింది. ఏకంగా 21 పరుగులు సాధించింది. డేవిడ్ వైసే తొలి నాలుగు బంతుల్లో 13 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతిని ఏకంగా సిక్సర్ కొట్టాడు. ఇక చివరి రెండు బంతులలో ఏరాస్మస్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే సూపర్ ఓవర్ లో నమీబియా విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. ఒమన్ ఒక వికెట్ కోల్పోయి, పది పరుగులు మాత్రమే చేసింది..
రెండు జట్లు అనామకమైనవే అయినప్పటికీ.. సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి.. ఒమన్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఎల్బిడబ్ల్యుగా అవుట్ అయ్యారు. మెన్స్ టీ20 క్రికెట్లో ఒక జట్టులో అత్యధిక బ్యాటర్లు వికెట్ల ముందు దొరికిపోవడం ఇదే తొలిసారి.. అంతకుముందు ఈ రికార్డు స్కాట్లాండ్, నెదర్లాండ్ జట్ల మధ్య ఉంది. శ్రీలంక తో జరిగిన ఓ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టుకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు, ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో స్కాట్లాండ్ దేశాన్ని చెందిన ఐదుగురు ఆటగాళ్లు వికెట్ల ముందు దొరికిపోయారు.
వాస్తవానికి ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్లడానికి ప్రధాన కారణం ఒమన్ బౌలర్ మోహ్రన్ ఖాన్. టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే చివరి ఓవర్ లో అత్యంత తక్కువ పరుగులను ఇచ్చిన బౌలర్ గా చరిత్రకెక్కాడు వాస్తవానికి చివరి ఓవర్ లో నమిబియా విజయానికి ఐదు పరుగులు అవసరం కాగా, మోహ్రన్ ఖాన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఈ ఘనత డేల్ స్టెయిన్ పేరు మీద ఉంది. అతడు 2014 టి20 ప్రపంచ కప్ లో చివరి ఓవర్ లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ రికార్డును ప్రస్తుతం మోహ్రన్ ఖాన్ బద్దలు కొట్టాడు.