శ్రమ నీ లక్షణం అయినప్పుడు.. విజయం నీ బానిస అవుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కావాల్సి వస్తే.. మీరాబాయి చానూను చూపిస్తే సరిపోతుంది. ఎక్కడో మణిపూర్ లో ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఈ యువతి.. ఇప్పుడు భారత త్రివర్ణ పతాకాన్ని విశ్వక్రీడా యవనికపై సగర్వంగా రెపరెపలాడించింది. ఆరంభంలోనే కోట్లాది మంది భారతీయుల ఆశలను నెరవేర్చింది. వెయిట్ లిఫ్టింగ్ లో రజతం గెలిచిన మీరాబాయి చానూ పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంతకీ ఎవరీ చానూ..? 130 కోట్ల మంది భారతీయులకు ‘జానూ’ ఎలా అయ్యింది? అన్నది ఇప్పుడు చూద్దాం..
టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్స్ లో.. భారత్ తరపున వెయిట్ లిఫ్టర్ గా అడుగు పెట్టిన మీరాబాయి.. 49 కేజీల (క్రీడాకారుల బరువు) విభాగంలో పోటీ పడింది. చైనాకు చెందిన హౌ జిహోయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న చానూ.. స్నాచ్ విభాగంలో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 115 కేజీల బరువు ఎత్తింది. ఆ విధంగా రజత పతకం ఖాయం చేసుకుని విజయ దరహాసం చిందించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 1948 నుంచి పోటీ పడుతున్న భారత్ ఇప్పటి వరకు సాధించింది ఒకే ఒక కాంస్య పతకం. తెలుగు క్రీడాకారని కరణం మళ్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ లో ఈ పతకం సాధించింది. ఇప్పుడు రెండో పతకం మీరాబాయి సాధించింది.
ఇక, మీరాబాయి ఎవరు అన్నది చూస్తే… మణిపూర్ రాజధాని ఇంపాల్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో 1994లో జన్మించింది. మొత్తం ఆరుగురు తోబుట్టువుల్లో మీరానే చిన్నది. అయితే.. చిన్న నాటి నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకున్న చానూ.. తొలుత ఆర్చర్ కావాలని భావించింది. కానీ.. మణిపూర్ కు చెందిన వెయిట్ లిఫ్టర్ కుంజరణి దేవిని చూసి.. మనసు మార్చుకున్నది. ఆమె స్ఫూర్తితోనే వెయిట్ లిఫ్టర్ గా మారింది. ఇంట్లో కట్టెలు మోయడం నుంచి చిన్న చిన్న పనులు చేస్తూనే తన సాధన కొనసాగించేది.
ఇక, చదువుకు ఆటకు, సమయం కుదరకపోవడంతో ఎంతో ఇబ్బంది పడేంది. ఇటు పాఠశాలకు, అటు వెయిట్ లిఫ్టింగ్ శిక్ణ కోసం నిత్యం ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజూ రెండు బస్సులు మారాల్సి వచ్చేది. ప్లస్ టూ పూర్తయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలోనే రైల్వే టీసీ ఉద్యోగం సాధించింది. అలా వచ్చే వేతనంతో కుటుంబ అవసరాలు తీరుస్తూ.. ఆటపై దృష్టి సారించింది. ఆ విధంగా.. తక్కువ కాలంలోనే ప్రముఖ లిఫ్టర్ గా ఎదిగింది.
అయితే.. 2017లో జరిగిన రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న చానూ.. సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. దీంతో.. మరింత కసిగా సాధన మొదలు పెట్టింది. తన లోపాలు ఎక్కడున్నాయనేది గుర్తించి, వాటిని సరిదిద్దుకోవడం మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమెరికా వెళ్లి కొంతకాలంపాటు శిక్షణ కూడా తీసుకుంది. ఆ తర్వాత తిరిగి వచ్చి సత్తా చాటింది. కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత.. ఇప్పుడు ఒలింపిక్స్ కు ఎంపికైన మీరాబాయి చానూ.. ఏకంగా రజత పతకం సాధించి, యావత్ భారతం గర్వించేలా చేసింది. కోట్లాది మంది భారతీయుల జానూగా మారిపోయింది చానూ.