Homeక్రీడలుOdi World Cup 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్‌ నిజమైన వారసడుడెవరు?

Odi World Cup 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్‌ నిజమైన వారసడుడెవరు?

Odi World Cup 2023: భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌–2023కు మరో 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ప్రధాన జట్లు తమ వ్యూహాలను, అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఒకడుగు ముందుకు వేసి ప్రపంచకప్‌ కోసం తమ జట్టును ప్రకటించగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ కూడా తమ జట్టును వెల్లడించేందుకు సిద్ధమైంది. మరోవైపు సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సత్తాచాటాలని భారత జట్టు కూడా భావిస్తోంది.

జట్టు ఎంపికకు బీసీసీఐ కసరత్తు..
ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ 15 మంది సభ్యుల వివరాలను సెప్టెంబర్‌ 5 లోపు ఐసీసీకి సమర్పించాలి. అంటే ఇంకా 20 రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈ క్రమంలో భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్‌ కమిటీ పడింది. అయితే టోర్నీలో భాగమయ్యే భారత జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు అంత సులభం కాదు. ఎందుకంటే వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ సమస్య భారత జట్టును ఎప్పటి నుంచో వెంటాడుతోంది.

యువీ వారసుడి వేట..
ఏ జట్టుకైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్ధానం చాలా కీలకం. టాపర్డర్‌ కుప్పకూలినప్పుడు జట్టును అదుకోవాల్సిన బాధ్యత నాలుగో స్ధానంలో వచ్చే ఆటగాడిది. అయితే భారత క్రికెట్‌లో మాత్రం నాలుగో స్ధానం అంటే టక్కున గుర్తుచ్చేంది మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌నే. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌ సింగ్‌.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పడు.. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌ విజయంలో యువరాజ్‌ పాత్ర మరవలేనది.

యువీ తర్వాత దొరకని ఆటగాడు..
అయితే యువీ రిటైర్మెంట్‌ తర్వాత ఆ స్థానానికి తగ్గ ఆటగాడు దొరకలేదు. అప్పటినుంచి భారత్‌కు నాలుగో స్థానం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్నాళ్లపాటు అంబటి రాయుడు ఆ స్ధానంలో అలరించాడు. రాయుడు విజయవంతం కావడంతో నాలుగో స్థానం కష్టాలు తీరిపోయాయని అంతా భావించారు. కానీ 2019కు ప్రపంచకప్‌కు ముందు రాయుడు అనుహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడంతో మళ్లీ భారత్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత చాలా మందిని ఆ స్ధానంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ట్రై చేసింది.

శ్రేయస్‌ అయ్యర్‌ సెట్టయ్యాడు..
అందులో అజింక్యా రహానే, దినేష్‌ కార్తీక్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కొన్నాళ్లు పాటు ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన భారత్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో పరిష్కారం దొరికింది. మిగితా వారితో పొలిస్తే అయ్యర్‌ నాలుగో స్థానంలో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అయ్యర్‌ 20 ఇన్నింగ్స్‌లలో 47.35 సగటుతో 805 పరుగులు సాధించాడు. అయితే ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్లు ముందు అయ్యర్‌ గాయపడడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సందర్భంగా గాయపడిన అయ్యర్‌.. దాదాపు 8 నెలల నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డేల్లో అతడి స్థ్ధానాన్ని టీ20 బ్యాటర్‌ సూర్యకుమార్‌యాదవ్‌తో జట్టు మెనెజ్‌మెంట్‌ ప్రయత్నించింది. కానీ భారత్‌కు నిరాశే ఎదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయి సూర్య తీవ్ర నిరాశపరిచాడు. అయితే మరో అప్షన్‌ లేకపోవడంతో ప్రస్తుతం సూర్యకుమార్‌నే భారత్‌ కొనసాగిస్తోంది. సూర్య తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవతున్నాడు. దీంతో అతడు ఆ స్థానానికి సరిపోడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరో ఐదుగురు..
ఈ క్రమంలో ప్రపంచకప్‌లో కీలకమైన నాలుగో స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. భారత సెలక్షన్‌ కమిటీకి ప్రస్తుతం ఐదు ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో అయ్యర్, రాహల్‌ వంటి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కూడా సెలక్టర్లను అందోళనకు గురిచేస్తోంది. కానీ యువ సంచలనం తిలక్‌ వర్మరూపంలో మరో ఎంపిక కూడా సెలక్టర్లకు దొరికింది.

శ్రేయస్‌ అయ్యర్‌:
వెన్నుగాయంతో జట్టుకు దూరమైన అయ్యర్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేదు. దీంతో అతడు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనడం అనుమానంగానే ఉంది. ఒకవేళ ఫిట్‌నెస్‌ టెస్టులో అయ్యర్‌ నెగ్గితే.. అతడిదే నాలుగో స్ధానం.

కేఎల్‌.రాహుల్‌..
టీమిండియా స్టార్‌ ఆటగాడు రాహుల్‌కు కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అనుభవం ఉంది. కానీ ఐపీఎల్‌లో గాయపడిన రాహుల్‌ కూడా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలోనే ఉన్నాడు. అయితే అతడు పూర్తిస్ధాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే రాహుల్‌ ఆ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

సూర్యకుమార్‌ యాదవ్‌:
టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి దుమ్మురేపుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో అతడివైపు జట్టు మేనేజ్‌మెంట్‌ మెగ్గు చూపే ఛాన్స్‌ లేదు.

సంజూ శాంసన్‌..
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సంజూ శాంసన్‌కు నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. మూడో వన్డేలో ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ.. అద్భుతమైన అర్ధసెంచరీతో చెలరేగాడు. సంజూకు కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌ చేసిన అనుభవం ఉంది. అయితే అతడు వన్డేల్లో కూడా టీ20ల్లో ఈ స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తుంటాడు.

తిలక్‌ వర్మ..
టీమిండియా యువ సంచలనం, హైదారాబాదీ తిలక్‌ వర్మ.. తన అరంగేట్ర సిరీస్‌లోనే అందరిని అకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ 20 ఏళ్ల హైదారాబాదీ తన సత్తా చూపించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ కమంలో అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక వన్డే మ్యాచ్‌ కూడా ఆడని వర్మను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular