India record victory: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా.. శుక్రవారం రాయ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు సాధించిన విజయం ఆ సామెతను నిజం చేసి చూపించింది. రాయ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు మీద 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది.
టి20 చరిత్రలో భారత జట్టు పేరు మీద ఇప్పటివరకు ఆస్ట్రేలియా మీద సాధించిన విజయమే అత్యధిక పరుగుల చేదనగా ఉండేది. ఆ రికార్డును ఇప్పుడు సూర్య సేన రాయ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా బద్దలు కొట్టింది. రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. 2023లో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా చేదించింది. 2019లో హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా 208 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. 2009లో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక విధించిన 207 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఫినిష్ చేసింది. 2020లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 204 పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. 2013లో రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా విజయవంతంగా ఫినిష్ చేసింది.
టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువసార్లు 200 మించిన లక్ష్యాలను ఛేదించడంలో టీమ్ ఇండియా రెండో స్థానానికి చేరుకుంది.ఈ జాబితాలో ఆస్ట్రేలియా (ఏడుసార్లు) మొదటి స్థానంలో ఉంది. భారత్ (ఆరుసార్లు), దక్షిణాఫ్రికా (ఐదుసార్లు), పాకిస్తాన్ (నాలుగు సార్లు), ఇంగ్లాండ్ (మూడుసార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
200 మించిన పరుగుల లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఇంకా ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్ పేరు మీద ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. రాయ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. తద్వారా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 2025 లో న్యూజిలాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ జట్టు ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. 2025 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే 215 పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. 2007లో వెస్టిండీస్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా 14 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది.