New Zealand Vs Australia 3rd T20: న్యూజిలాండ్ వేదికగా ఆస్ట్రేలియా, కివిస్ జట్లు మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా తొలి టీ 20 మ్యాచ్లో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఫినిష్ చేసింది.. ఆస్ట్రేలియా విజయంలో కెప్టెన్ మార్ష్ ముఖ్యపాత్ర పోషించాడు. 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో అతడు ఏకంగా 85 పరుగులు చేశాడు. దీంతో ఆతిథ్య కివిస్ జట్టుకు ఓటమి తప్పలేదు.
రెండవ టి20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 2.1 ఓవర్ల పాటు ఆడింది. 16 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. ఈలోగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో సిరీస్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. ఈ సిరీస్ విజేతను నిర్ధారించే చివరి టి20 మ్యాచ్ శనివారం జరగనుంది. ఓవల్ మైదానంలోనే ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అక్కడ వర్షాలు కురిసే అవకాశం లేకపోయినప్పటికీ.. ఆకాశం మేఘావృతమైందని తెలుస్తోంది. మ్యాచ్ నిర్వహణకు అంతరాయం కలిగే అవకాశం లేదని సమాచారం.
ఒకవేళ గనుక ఈ టి20 సిరీస్ ఆస్ట్రేలియా విజయం సాధిస్తే వరుసగా నాలుగు సిరీస్ లను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఆస్ట్రేలియా పొట్టి ఫార్మాట్ లో బీభత్సమైన ఫామ్ లో ఉంది. వరుస సిరీస్ విజయాలు సొంతం చేసుకుంటూ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టుపై కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. మామూలుగా అయితే కివీస్ నుంచి పర్యాటక ఆస్ట్రేలియా కు గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా పరిస్థితి లేదు. బ్యాటింగ్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు వీరవిహారం చేస్తూ ఉంటే.. న్యూజిలాండ్ బౌలర్లు చూస్తూ ఉండిపోతున్నారు. తొలి టి20 మ్యాచ్ లో ఆ స్థాయిలో స్కోర్ చేసినప్పటికీ న్యూజిలాండ్ నిలుపుకోలేకపోయింది అంటే.. ఆ జట్టు బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు తన ఎఫర్ట్ మొత్తం చూపించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాపై అన్ని విభాగాలలో పై చేయి సాధించాల్సి ఉంటుంది.
బౌలింగ్ లో ఆస్ట్రేలియా కొంతమేర పరవాలేదనిపిస్తోంది. బ్యాటింగ్లో మాత్రం దుమ్ము రేపుతోంది. కెప్టెన్ మార్ష్.. హెడ్ వంటి వారు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా చాలు దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్లే ఆస్ట్రేలియా ఎంతటి భారీ టార్గెట్ ఉన్నా సరే భయపడడం లేదు. తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆ స్థాయిలో విజయం సాధించింది అంటే దానికి ఆ జట్టుకు ఉన్న బలమైన బ్యాటింగే కారణం. బలమైన బ్యాటింగ్ ను న్యూజిలాండ్ జట్టు పడగొడితేనే విజయావకాశాలుంటాయి.