Narendra Modi – Chandrababu : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. దానిని మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఆదివారం ఏపీలోని చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తారు..” నరేంద్ర మోడీ లాంటి నాయకుడు దొరకడం ఈ దేశం చేసుకున్న అదృష్టం. అతను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా భౌగోళికంగా ఏపీ నష్టపోయింది. జగన్ చేసిన విధ్వంసకర పాలన వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి తరుణంలో ఏపీని బాగు చేయాలంటే టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలి. అలా అయితేనే ఏపీ భవిష్యత్తు బాగుంటుంది. అదృష్టవశాత్తు మాకూటమికి నరేంద్ర మోడీ మద్దతు తెలిపారు. ఆయనకు మా కృతజ్ఞతలంటూ” చంద్రబాబు నాయుడు అన్నారు.
దశాబ్దం క్రితం నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై ప్రసంగించారు. వీరు ముగ్గురు అప్పట్లో కూటమిగా ఏర్పడుతున్నట్టు ప్రకటించారు. అప్పటి ఎన్నికల్లో టిడిపి, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీపై విజయం సాధించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కానీ కొంతకాలానికే ఆ కూటమి నుంచి బిజెపి బయటికి వచ్చింది. జనసేన ఎలాగో ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి.. ఆ పార్టీ ఎటువంటి మంత్రి పదవులు తీసుకోలేదు. కొంతకాలానికి పవన్ కళ్యాణ్ కూడా బయటికి వచ్చారు.
ఇక గత ఎన్నికల్లో నరేంద్ర మోడీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి వస్తే టిడిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు. అప్పట్లో నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత భార్యని పట్టించుకోలేనోడు.. దేశాన్ని ఏం పట్టించుకుంటాడని విమర్శించారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో.. చంద్రబాబుకు వాస్తవం అర్థమైంది. కొద్దిరోజులపాటు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి ఎలాగోలా మోడీ పంచన చేరారు. చివరికి తన కూటమిలోకి రప్పించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాల్సి ఉంది.