వచ్చే నెలలో డేవిస్ ఫైనల్స్ తర్వాత ఆధునిక టెన్నిస్ కు రఫెల్ నాదల్ వీడ్కోలు పలుకుతాడు. 23 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్.. 22 గ్రాండ్ స్లామ్ లు సాధించిన రఫెల్ నాదల్.. ఆధునిక టెన్నిస్ లో సరికొత్త రికార్డులు సృష్టించాడు. 2004లో తన కెరియర్ మొదలుపెట్టిన రఫెల్ నాదల్.. ఎక్కువ కాలం స్విస్ థండర్ రోజర్ ఫెదరర్ తోనే తలపడ్డాడు. ఒకానొక దశలో అతడికి గట్టి సవాళ్లు విసిరాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో కొన్ని సంవత్సరాలపాటు ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఫెదరర్, నాదల్ మొట్టమొదటిసారిగా 2004లో మార్చి నెలలో మియా మీలో కలుసుకున్నారు. అప్పుడు నాదల్ కు 17 సంవత్సరాల వయసు మాత్రమే. టెన్నిస్ ర్యాంకింగ్స్ లో అతడు 34వ ర్యాంక్ లో ఉన్నాడు. అప్పటికి ఫెదరర్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్. ఆ సంవత్సరం అప్పటికే అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండియన్ వేల్స్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నాదల్ ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాడు. కొన్ని సీజన్లలో ఫెదరర్ పై పై చేయి సాధించాడు. అయితే నాదల్ తో పోటీని ఫెదరర్ ఆస్వాదించేవాడు.. నాదల్ ఫెదరర్ తో తలపడడాన్ని ఆనందించేవాడు. నాదల్ టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన తర్వాత ఫెదరర్ భావోద్వేగానికి గురయ్యాడు. ” ఏం కెరియర్ రఫా! ఈరోజు ఎప్పటికీ రాదని నేను భావించాను. నీతో నాకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. మనం ఇష్టపడే ఈ గేమ్ లో నువ్వు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించావు. అవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చే. 2004లో మనిద్దరం మియామీలో కలుసుకున్నాం. ఎన్నో ఎత్తు పల్లాలు చూసాం. గొప్ప ఆటను ఆస్వాదించామని” ఫెదరర్ వ్యాఖ్యానించాడు.
ప్రత్యర్ధులుగానే ఉన్నారు..
రోజర్ ఫెదరర్ – నాదల్ 2022లో లావర్ కప్ లో తలపడ్డారు. లండన్ లో జరిగిన ఆ మ్యాచ్లో నాదల్ గెలిచాడు. ఆ తర్వాత రోజర్ ఫెదరర్ టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. అతడు ఆ నిర్ణయం ప్రకటించడంతో నాదల్ కన్నీటి పర్యంతమయ్యాడు. ” జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కూడా ఈరోజు వెళ్ళిపోతోందని” వ్యాఖ్యానించాడు. నాదల్ 2020 లో తన 13వ ఫ్రెంచ్ ఓపెన్ ను దక్కించుకున్నాడు. ఆ సమయంలో ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్ రికార్డును సమం చేశాడు. అప్పుడు ఫెదరర్ నాదల్ సాధించిన ఘనతను ఉద్దేశిస్తూ..” టెన్నిస్లో సాధించిన అతిపెద్ద విజయమని” అభివర్ణించాడు. అయితే నాదల్ – ఫెదరర్ ఎప్పుడూ ప్రొఫెషనల్ ఆటగాళ్ల మాదిరిగానే ప్రవర్తించారు. ఆటను ఆస్వాదించారు. ప్రత్యర్ధులుగానే ఉన్నారుగాని.. శత్రువులుగా మారలేదు. ఇప్పటికీ వారిద్దరూ తరచూ ఫోన్లు చేసుకుంటారు. అనేక విషయాలపై మాట్లాడుకుంటారు. 2008లో వింబుల్డన్లో విజయం సాధించి.. గ్రాండ్ స్లామ్ విజయాలలో 6-3 తేడాతో ఫెదరర్ పై చేయి సాధించాడు.