సమర్పయామీ.. మరో మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ చేజేతులారా ముంబైకి అర్పించింది. గెలవాల్సిన మ్యాచ్ ను ఓడిపోయింది. బౌలర్లు సత్తా చాటి ముంబై ఇండియన్స్ ను 150 పరుగులకు పరిమితం చేస్తే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి దూకుండా ఆడిన సన్ రైజర్స్ ఒకదశలో ఓపెనర్లు దంచి కొట్టడంతో 100 పరుగులు ఈజీగా చేసింది. చివరి 50 పరుగులు చేయలేక మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో మూడో పరాజయం సన్ రైజర్స్ కు వచ్చింది.
టాస్ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డికాక్ 40, రోహిత్ 32 పరుగులతో రాణించారు. అనంతరం చివర్లో పోలార్డ్ 35 పరుగులతో దంచికొట్టడంతో ముంబై 150 పరుగులు చేసింది. భారీ హిట్టర్లున్న ముంబైని పరుగులు చేయడానికి చాలా కష్టపడేలా చేశారు సన్ రైజర్స్ బౌలర్లు. వారు అద్భుతమైన బౌలింగ్ తో ముంబై బ్యాట్స్ మెన్ ను కట్టిపడేశారు.
అయితే 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో శుభారంభం ఇచ్చారు. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. 22 బంతుల్లోనే బెయిర్ స్టో 43 పరుగులు చేసి ఊపు ఊపేశాడు. అయితే దురదృష్టవశాత్తూ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అతడే ఉండుంటే సన్ రైజర్స్ గెలిచేది. ఇక వార్నర్ తడబడుతూనే 36 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు.ఎవరూ 10 పరుగులు కూడా చేయలేదు. విజయ్ శంకర్ 28 పరుగులతో పోరాడిన ఫలితం దక్కలేదు.
మిడిల్ ఆర్డర్ ఘోరవైఫల్యంతో సన్ రైజర్స్ గెలవాల్సిన మ్యాచ్ ను ఘోరంగా ఓడింది. ఓడిపోతుందనుకున్న ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో గెలిచింది.
ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం మరోసారి కనిపించింది. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయం సన్ ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. అతడే ఉంటే జట్టు ఇలా కుప్పకూలదని.. టీం గెలుస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు.