Mumbai vs Rajasthan IPL Match Preview 2026: ఐపీఎల్ లో మరికొద్ది గంటల్లో గౌహతివేదికగా ముంబై, రాజస్థాన్ రాయల్స్ తల పడబోతున్నాయి. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఉత్సాహంతో కనిపిస్తోంది. ముంబై జట్టు ఒక విజయం, ఓటమితో కాస్త ఇబ్బందుల్లోనే ఉంది. ఆటగాళ్లపరంగా చూసుకుంటే ముంబై కాస్త బలంగా ఉన్నప్పటికీ.. రాజస్థాన్ జట్టును ఓడించడం దానికి అంత ఈజీ కాదు.
గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ముంబై, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్ 16-14 గా నమోదయింది. 2021 నుంచి ముంబై జట్టు రాజస్థాన్ తో 8 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్లలో గెలిచింది. ముంబై ఇండియన్స్ 2023 నుంచి ఇతర మైదానాలలో 24 మ్యాచులు ఆడింది. ఇందులో తొమ్మిది మాత్రమే గెలిచింది.. 2020 నుంచి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో 180 లేదా అంతకంటే తక్కువ లక్ష్యాన్ని నాలుగు సార్లు మాత్రమే కాపాడుకుంది. 25 సార్లు ఓటమిపాలైంది.
ఈ రికార్డు ముంబై ఇండియన్స్ జట్టును కాస్త కలవర పెడుతోంది. ఇప్పటివరకు రాజస్థాన్ జట్టు రెండు విజయాలు సాధించినప్పటికీ.. ఆ జట్టు నుంచి పూర్తిస్థాయిలో ప్రదర్శన రాలేదనేది వాస్తవం. ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే జట్టు భారాన్ని మోయడం.. మిగతావారు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం విశేషం. ఇదే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ పెర్ఫార్మన్స్ కోచ్ సిద్ధార్థ లాహిరి కూడా అంగీకరించారు.. “ఇది మాకు చాలా ఘనమైన ప్రారంభం. మేము రెండు మ్యాచులు ఆడాము. అందులో గెలిచాము. ఇది మాకు సుదీర్ఘ సీజన్. మా మొదటి రెండు మ్యాచ్లలో గెలిచినంత మాత్రాన మేము ఉత్సాహంగా లేమని” సిద్ధార్థ లాహిరి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. “క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. అందువల్లే ఆటగాళ్లు ప్రాక్టీస్ విపరీతంగా చేస్తున్నారు.. సరిగా రెండు మూడు సంవత్సరాల క్రితం 200 ప్లస్ లేదా 250 ప్లస్ టార్గెట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కాకపోతే మా బౌలర్లు నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మెరుగైన ఫలితం వస్తుందని అంచనా మాకు ఉందని” పరాస్ వ్యాఖ్యానించాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఏ ఆటగాడు కూడా గాయం వల్ల దూరం కాలేదు. శుభం దూబే సోమవారం నెట్స్ లోకి వచ్చాడు. చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతనిలోపాలను గుర్తించి.. మెరుగ్గా ఆడాలని సూచించాడు.
రాజస్థాన్ జట్టులో సందీప్ శర్మ కీలక బౌలర్ గా ఉన్నాడు. టి20లలో రోహిత్ శర్మను ఐదుసార్లు.. సూర్య కుమార్ యాదవ్ ను నాలుగు సార్లు అవుట్ చేశాడు. వీరిద్దరికి 76 బంతులు వేసిన అతడు.. 71 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
జట్ల అంచనా
రాజస్థాన్
జైస్వాల్, జూరల్, వైభవ్, పరాగ్, హిట్ మేయర్, జడేజా, ఫెరీర, తుషార్, సందీప్ శర్మ, బర్గర్, రవి.
ముంబై
మయాంక్ మార్కండే, రోహిత్, రికెల్టన్, సూర్య కుమార్, తిలక్ వర్మ, హార్దిక్, రూథర్ఫర్డ్, నమన్ దీర్, శాంత్నర్, శార్దుల్, బుమ్రా, బౌల్డ్.