Prithvi Shah : పృథ్వీ షా.. ముంబై రంజీ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ గా ఉండేవాడు. మొదట్లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. ముంబై జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. అయితే క్రమేపీ అతడి ఆట తీరు మారింది. వివాదాలు చుట్టుముట్టడంతో కెరియర్ సంకటంలో పడింది. చివరికి ముంబై రంజీ ట్రోఫీ నుంచి అతడిని తొలగించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ముంబై రంజీ ట్రోఫీ మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. వాస్తవానికి పృథ్వీ షా ను పక్కన పెట్టడానికి స్పష్టమైన కారణం వెల్లడించకపోయినప్పటికీ..ఫిట్ నెస్ లేకపోవడం, క్రమశిక్షణను పాటించకపోవడం వంటి విషయాలలో.. కోచ్ ల నుంచి అతడిపై మేనేజ్మెంట్ కు ఫిర్యాదులు వచ్చినట్టు జాతియా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ తరఫున సంజయ్ పాటిల్(చైర్మన్), జితేంద్ర థాకరే, కిరణ్ పొవార్, ఎలిగేటి విక్రాంత్, రవి ఠాకూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పృథ్వీ షా వైఖరి అంతకంతకూ ఇబ్బందికరంగా మారడంతో జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తలనొప్పిగా మారింది
పృథ్వీ షా వ్యవహారం ముంబై జట్టుకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. అతడు నెట్టు సెషన్స్ ను ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. అతడికి నచ్చినప్పుడు మాత్రమే నెట్ సెక్షన్స్ కు వస్తున్నాడు. అందులోనూ సమయాన్ని పాటించడం లేదు. ఈ మధ్య అధికంగా బరువు పెరిగాడు. క్రికెట్ ను ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. అందువల్లే మేనేజ్మెంట్ అతడిని దూరం పెట్టిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పృథ్వీ షా 2018 లోనే వెస్టిండీస్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు.. చురుకైన ఆటగాడిగా పేరుపొందినప్పటికీ వివాదాలు అతడిని జట్టుకు దూరం చేశాయి. వ్యక్తిగత జీవితంలోనూ అనేక వివాదాలు ఉన్నాయి. ఆమధ్య సామాజిక మాధ్యమా ఇన్ ఫ్లూ యన్సర్ సప్న గిల్ పృథ్వీ షా పై సంచలన ఆరోపణలు చేసింది. అతడు తనను వేధించినట్టు కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో పృథ్వీ షా పరువు పోయింది. పైగా అతడు ఆడిన 2 రంజీ గేమ్స్ లో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. బరోడాపై 7, 12, మహారాష్ట్ర పై 1, 39* పరుగులు మాత్రమే చేశాడు. దూకుడుగా ఆడతాడు అని పేరు తెచ్చుకున్న అతడు.. క్రమేపీ తన ఫామ్ కోల్పోయాడు. ఫలితంగా జట్టుకు దూరమయ్యాడు.. ఒకానొక సందర్భంలో పృథ్వీ షా లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లక్షణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వినిపించాయి.. అతడు ఐదు టెస్టులు, 6 వన్డే లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. తన ఆరంగేట్ర రాజ్ కోట్ టెస్ట్ లో సెంచరీ చేసి పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత అదే లయను కొనసాగించడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. అందువల్లే ప్రస్తుతం జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.