
WPL 2023 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంగేట్ర సీజన్ లో ముంబై జట్టు మెరిసింది. కప్పును ఎగిరేసుకుపోయింది.. ఐపీఎల్ లోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో ముంబై జట్టు ధనాధన్ ఆటతీరుతో టోర్నీ మొత్తం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పై చేయి సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టును ఓడించింది. ఇసి వాంగ్ (3/42), హేలీ మ్యాథ్యూస్ (3/5), అమెలియా కేర్ (2/18) ముంబై తరఫున బౌలింగ్లో మెరుపులు మెరిపించారు. బ్యాటింగ్లో నాట్ సీవర్ (55 బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో 66 పరుగులు నాటౌట్) దుమ్ము రేపే ఇన్నింగ్స్ ఆడింది.
ముందుగా ఢిల్లీ బ్యాటింగ్ చేయగా.. ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ ( 29 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 35), శిఖా పాండే ( 17 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 27 నాట్ అవుట్), రాధా యాదవ్( 12 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 27 నాట్ అవుట్) ఢిల్లీ జట్టును ఆదుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై 19.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. నాట్ సీవర్ తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 5 ఫోర్లు 37), అమేలియా కేర్ ( 8 బంతుల్లో రెండు ఫోర్లతో 14 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్ జోనాసెన్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం మరీ అంత పెద్దది కాకపోయినప్పటికీ ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముంబై జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నాలుగు ఓవర్లలో 24 పరుగులకే ఓపెనర్లు హేలీ(13), యాస్తికా భాటియా(4) ను ముంబై జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో సీవర్, హర్మన్ ప్రీత్ కౌర్ ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. నిదానంగా ఆడటంతో రన్ రేట్ పెరుగుతూ పోయింది. 11 ఓవర్లలో ముంబై జట్టు కేవలం 55 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త వేగం పెంచినప్పటికీ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 95 పరుగుల వద్ద నిలిచిన ముంబై జట్టుకు చివరి 4 ఓవర్లలో 37 పరుగులు అవసరం పడ్డాయి. చేతిలో 8 వికెట్లు ఉన్నప్పటికీ ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నడంతో ముంబై జట్టుకు ఆ లక్ష్యం కఠినంగా అనిపించింది. ఇదే నేపథ్యంలో కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అవ్వడం తో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. కానీ సీవర్ దూకుడైన ఆట తీరు ప్రదర్శించడంతో స్కోర్ బోర్డు కదిలింది.
18 ఓవర్లో ఢిల్లీ బౌలర్ శిఖ ఐదు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. 19 ఓవర్ లో అనవసరంగా ఒత్తిడికి గురైన ఢిల్లీ బౌలర్ జోనా స్సేన్ 16 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్ళింది. చివరి ఓవర్ లో ఐదు పరుగులు చేయాల్సి రావడంతో.. ముంబై సునాయాసంగా కొట్టింది. జోనా స్సేన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే ఢిల్లీ జట్టుకు అవకాశాలు ఉండేవి.