Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో మాత్రం మరే జట్టుకు అందని విధంగా చెత్త ప్రదర్శన చేస్తోంది. వరుసగా 8వ మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవి చూసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో తొలిసారిగా వరుసగా 8 పరాజయాలు పొందిన టీమ్‌గా చెత్త రికార్డు నమోదు చేసింది. ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓటమి పాలైంది. దీంతో బోణీ కొట్టాలని ఎదురు చూసిన ఆ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో రెండో సెంచరీతో అదరగొట్టాడు. 62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 103 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి నాటౌట్‌గా నిలిచాడు. ఓ రకంగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. దీంతో లక్నో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్ సేన నెమ్మదిగా పుంజుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఒత్తిడికి లోనై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా వేలంలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ తన జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. రోహిత్ 39 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చినా అనవసర షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. తిలక్ వర్మ (38) మినహా మరెవరూ రాణించలేదు. టాలెంటెడ్ ప్లేయర్ సూర్యకుమార్ కూడా నిరాశపరిచాడు.

అయితే ఈ సీజన్‌లో ముంబై వరుస పరాజయాలకు బ్యాటింగ్ వైఫల్యమే కారణమని చెప్పాలి. ఇషాన్ కిషన్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బ్రెవిస్, తిలక్ వర్మ, పొలార్డ్, డానియల్ శామ్స్ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉన్నా.. వారి వైఫల్యాలే జట్టును కొంపముంచుతున్నాయి. రోహిత్ రాణించకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. కొద్దో గొప్పో తిలక్ వర్మ రాణిస్తున్నా అతడికి సహకారం ఇచ్చేవారు కరువయ్యారు. మరోవైపు బౌలర్లు కూడా గతి తప్పుతున్నా.. చిన్న టార్గెట్లను సైతం బ్యాటర్లు ఛేదించలేకపోతున్నారు. మరి రానున్న మ్యాచ్‌లలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తే తప్ప ముంబై గెలుపు చూడటం సాధ్యం కాదు.