MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగింపు దశకు వచ్చింది. ఆదివారం రాత్రి జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ఈ సీజన్ ముగిసిపోతుంది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై ఉన్న అభిమానాన్ని పలువురు ప్రత్యేక సందేశాలుగా పెడుతున్నారు. ఆ విడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
ప్రపంచ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతో క్రేజ్ ఉంది. కోట్లాది మంది ధోనీని అభిమానిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ లో ధోని సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లక్షలాది మంది అభిమానులు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నై జట్టు ఆడుతుండడంతో ధోని అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ ప్రారంభమవుతుందా..? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనిపై తమకున్న అభిమానాన్ని వేలాదిమంది సందేశాల రూపంలో పంచుకుంటున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచి ముంబై రికార్డును సమం చేయాలన్న లక్ష్యంతో చెన్నై జట్టు ఉంది. ఇదే చివరి సీజన్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సందేశాలను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం పోస్ట్ చేస్తున్నారు. ఆ సందేశాలు వైరల్ గా మారుతున్నాయి.
అభిమానులకు జెర్సీలు విసిరిన మహేంద్ర సింగ్ ధోని..
ధోనీని చూసేందుకే చెన్నై జట్టు మ్యాచ్ ల కోసం వేలాది మంది అభిమానులు మైదానాలకు వస్తుంటారు. ధోని మైదానంలో కనిపిస్తే చాలు వారి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ధోని కూడా ఈ సీజన్లో అభిమానుల పట్ల తన కృతజ్ఞతను అనేకసార్లు ప్రకటించాడు. చెన్నై చెపాక్ మైదానంలో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన అనంతరం ధోని స్టేడియంలో పరేడ్ నిర్వహించి అభిమానుల వైపు జెర్సీలను విసిరిన విషయం తెలిసిందే. ఆదివారం ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అభిమానులు ధోనిపై చూపించే ప్రేమకు సంబంధించిన ఓ వీడియోను ఐపీఎల్ యాజమాన్యం ట్విట్టర్ లో పంచుకుంది. ‘ధోని అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు ఎమోషన్’, ‘ ‘ప్రతి ఒక్కరూ ధోనీ అభిమానే’ అంటూ ఆ వీడియో క్యాప్షన్ ఇచ్చింది. ఆ వీడియోలో పలువురు ధోనిపై అభిమానాన్ని ఇలా వ్యక్తం చేశారు.
* ‘ఐపీఎల్ విధుల్లో నేను 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను ధోనీని చూడటం కోసమే నేను ఈ జాబ్ చేస్తున్నాను’
* ‘ధోనీకిదే చివరి ఐపీఎల్ అని పలువురు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. అయితే భవిష్యత్తులో సిఎస్కేకు ఎంత మంది కెప్టెన్లు వచ్చినా ధోని లాంటి వారిని మాత్రం మనం ఎప్పుడూ చూడం’
* ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా కూల్ గా ఉంటాడు. తలా ఎప్పటికీ తలానే’ అంటూ వందలాది మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియోని చూస్తున్న ఎంతోమంది ధోనిని పిచ్చిగా ప్రేమిస్తున్న వారిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాడు అంటూ పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.