Homeక్రీడలుAmbati Rayudu : ఐపీఎల్ ఫైనల్ ముందర బిగ్ షాక్.. రిటైర్ మెంట్ ప్రకటన

Ambati Rayudu : ఐపీఎల్ ఫైనల్ ముందర బిగ్ షాక్.. రిటైర్ మెంట్ ప్రకటన

Ambati Rayudu : చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగేదే తనకు చివర మ్యాచ్ అంటూ ట్వీట్ చేశాడు. గత కొద్ది రోజుల నుంచి అంబటి రాయుడు రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అంబటి రాయుడు ఈ మేరకు ట్వీట్ చేయడంతో దీనిపై స్పష్టత వచ్చింది. 14 సీజన్లపాటు ఐపీఎల్ లో ఆడిన అంబటి రాయుడు గొప్పగానే రాణించాడు. అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంబటి రాయుడు తన ఐపిఎల్ ప్రయాణానికి ముగింపు చెప్పేశాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ తనకి చివరి ఐపీఎల్ మ్యాచ్ అంటూ ట్విట్టర్లో రాయుడు వెల్లడించాడు. ఏపీలో రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం కొద్ది రోజుల నుంచి రాయుడుపై జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాయుడు రిటైర్మెంట్ గురించి ప్రకటన చేయడంతో రాజకీయాలు దిశగా వెళతారన్న చర్చ జోరుగా సాగుతోంది.

14 సీజన్లు..  రెండే జట్లకు ఆడిన రాయుడు..
రిటైర్మెంట్ గురించి ట్విట్టర్లో స్పందించిన అంబటి రాయుడు ఈ విధంగా పోస్ట్ చేశాడు. ” ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున 14 సీజన్లలో 204 మ్యాచులు, 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్ ఆడాను. ఐదు ట్రోపీలు సాధించిన టీమ్ లో భాగస్వామిగా ఉన్నాను. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. ఇవాళ రాత్రి ఆడే మ్యాచ్ నా కెరీర్లో చివరిది. యూటర్న్ తీసుకునే ప్రసక్తే లేదు. అందరికీ ధన్యవాదాలు’ అని ట్విట్టర్లో అంబటి రాయుడు పేర్కొన్నాడు. దీంతో అంబటి రాయుడు రిటైర్మెంట్ పై కొద్దిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారం వాస్తవరూపం దాల్చినట్టు అయింది.
అద్భుతమైన ఆట తీరు కనబరిచిన రాయుడు..
ఐపీఎల్ కెరియర్ లో అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. 2010 నుంచి ఐపీఎల్ లో అంబటి రాయుడు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 204 మ్యాచులు ఆడిన రాయుడు.. 127.29 స్ట్రైక్ రేటుతో 4329 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 100 పరుగులు కాగా, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి. 2018 సీజన్లో అత్యధికంగా 602 పరుగులు చేశాడు అంబటి రాయుడు. 2017, 2023 సీజన్లు మినహా మిగిలిన అన్ని సీజన్లోనూ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. మొత్తంగా ఐపీఎల్ లో 28.29 యావరేజ్ తో రాయుడు పరుగులు చేశాడు. ఈ ఏడాది 15 మ్యాచులు ఆడినప్పటికీ 139 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 27 పరుగులు కావడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్ లో అయినా అంబటి రాయుడు మెరుగైన ప్రదర్శన చేసి ఐపీఎల్ కెరియర్ కు గొప్ప ముగింపు ఇస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాజకీయరంగ ప్రవేశం ఉంటుందా..?
కొద్దిరోజుల కిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ అంబటి రాయుడు ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత కూడా తాడేపల్లిగూడెంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కి వచ్చి కలిసి వెళ్ళాడు. దీంతో అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగింది. తాజాగా, రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ దిశగా రాయుడు అడుగులు వేస్తాడని చర్చ సాగుతోంది. మరి అంబటి రాయుడు ఏపీలో రాజకీయాల బరిలోకి దిగుతాడా..? లేక క్రికెట్ అకాడమీ పెడతాడా..? అన్నది తేలాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular