MS Dhoni: వింటేజ్ ధోని దర్శనం..ఇదే నిదర్శనం..

ముఖ్యంగా ఖలీల్ అహమ్మద్ వేసిన 18 ఓవర్ లో ధోని కొట్టిన సిక్స్ అభిమానులను సమ్మోహనులను చేసింది. క్రీజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మ్యాచ్ మోసే వరకు విశాఖపట్నం అదిరిపోయింది. అభిమానుల అరుపులతో సందడిగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 1, 2024 8:03 am

MS Dhoni

Follow us on

MS Dhoni: అదే జులపాల జుట్టు.. వికెట్ల మధ్యలో అదే పరుగు.. అదే హెలికాప్టర్ బ్యాట్ ఊపు.. వెరసి విశాఖపట్నం ప్రేక్షకులు ఊగిపోయారు. వింటేజ్ తలా దర్శనం. ఇది నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదివారం రాత్రి విశాఖపట్నం అభిమానులకు అసలు సిసలైన టి20 మజా అందించాడు. తన పాత రూపాన్ని మరోసారి పరిచయం చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని వీర విహారం చేశాడు. అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్ లో 4, 6, 0, 4, 0, 6 లతో 20 పరుగులు పిండుకున్నాడు. శివం దూబే వెనుదిరిగిన తర్వాత ఎనిమిదో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు దిగాడు. రావడంతోనే బౌండరీ కొట్టాడు. తదుపరి బంతికి ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన పూర్వపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తనకు ఇష్టమైన విశాఖపట్నం స్టేడియంలో రాజస్థాన్ బౌలర్లను భయపెట్టాడు.

ముఖ్యంగా ఖలీల్ అహమ్మద్ వేసిన 18 ఓవర్ లో ధోని కొట్టిన సిక్స్ అభిమానులను సమ్మోహనులను చేసింది. క్రీజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మ్యాచ్ మోసే వరకు విశాఖపట్నం అదిరిపోయింది. అభిమానుల అరుపులతో సందడిగా మారింది. ధోని మైదానానికి దిగడంతో అభిమానులు తమ ఉద్వేగాన్ని వివిధ రూపాల్లో చాటారు. అరుపులతో స్టేడియాన్ని మోతెక్కించారు. అభిమానుల అరుపులతో ఢిల్లీ ఆటగాళ్లు తడబాటుకు గురయ్యారు. ఒత్తిడిలో తప్పులు చేశారు. ఢిల్లీ విశాఖపట్టణాన్ని సొంత మైదానంగా భావించినప్పటికీ.. ఆదివారం నాటి మ్యాచ్ చెన్నై సొంత మైదానాన్ని తలపించింది. మైదానం మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయినప్పటికీ ధోని బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ధోని తన బ్యాటింగ్ స్టైల్ తో ఢిల్లీ విజయాన్ని మరుగున పడేశాడు..

ఈ మ్యాచ్లో ముందుగా ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ 52, పంత్ 51, పృథ్వి షా 43 పరుగులు చేసి అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో మతీష పతిరన మూడు వికెట్లు తీశాడు. రెహమాన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. అనంతరం చేజింగ్ కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేసింది. రహనే 45, ధోని 37 నాట్ అవుట్, మిచెల్ 34 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. ఢిల్లీ జట్టులో ఖలీల్ అహ్మద్ రెండు, ముఖేష్ కుమార్ 3, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్ ద్వారా ధోని మరోచరిత్ర సృష్టించాడు. టి20 క్రికెట్ చరిత్రలో 300 వికెట్లలో తన వంతు పాత్ర పోషించిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో ధోని ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ఇచ్చిన క్యాచ్ ద్వారా 300 ఔట్ల ఘనతను సాధించాడు. ఈ జాబితాలో మరే ఇతర వికెట్ కీపర్ ధోని దరిదాపుల్లో కూడా లేడు. 300 డిస్మిసల్స్ తో ధోని మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కమ్రాన్ అక్మల్ 274, దినేష్ కార్తీక్ 274, క్వింటన్ డికాక్ 270, బట్లర్ 209 తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.