Happy Birthday MS Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదివారం 43వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తన సన్నిహితుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి తన ఆనందాన్ని వారితో పంచుకున్నాడు. అయితే ఆ కేక్ తన అభిమానులు పంపించడంతో.. ఎంతో ఉత్సాహంగా ధోని కట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ధోనికి వెల్లువలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Happy birthday to you my dear thala అనే యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ధోని జన్మదిన వేడుకలకు సంబంధించి ఆయన భార్య సాక్షి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోకు కొన్ని గంటల్లోనే లక్షలకొద్దీ లైక్స్ రావడం విశేషం.. వేలాదిమంది కామెంట్స్ చేశారు.. ధోని జన్మదినం సందర్భంగా ఈ అద్భుతమైన దృశ్యం బయటి సమాజానికి తెలిసింది..
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ సంగీత్ వేడుకకు ధోని, అతని భార్య సాక్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని తన 43వ పుట్టినరోజు వేడుకలను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి జరుపుకున్నాడు. హోటల్లో అభిమానులు తనకు పంపించిన కేక్ ను శనివారం అర్ధరాత్రి కట్ చేసి.. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో తన భర్తకు సాక్షి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ధోని పాదాలను తాకి నమస్కరించింది. దీనికి ధోని సాక్షిని తన చేతులతో పైకి తీసుకొని ఆశీర్వదించాడు. పక్కనే ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ధోనీకి శుభాకాంక్షలు తెలియజేశాడు.. happy birthday to you captain Sahab అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.
మహేంద్ర సింగ్ ధోని 1983, జూలై 7న జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. గత సీజన్లో తన కెప్టెన్ పదవి నుంచి వైదొలిగాడు. ధోని ఆధ్వర్యంలో చేనేజట్టు ఇప్పటివరకు ఐదుసార్లు ట్రోఫీలు దక్కించుకుంది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ధోని చాలా సైలెంట్ గా ఉంటాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూల్ గా ఉంటాడు. ధోనికి బైకులు అంటే చాలా ఇష్టం. కార్లను కూడా ఇష్టంగా నడుపుతాడు. అతడి గ్యారేజీలో అరుదైన ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీకి భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉన్నారు. క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ తలా, మహీ గా అభిమానుల గుండెల్లో చిర స్థాయిలో నిలిచిపోయాడు.