YCP: వైసీపీలో ఎంపీ అభ్యర్థులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నట్టు.. మొన్న గుమ్మనూరు జయరాం.. నిన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. నేడు ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 23 మంది ఎంపీలు గెలుపొందారు. ఎక్కువమంది ఎంపీలు గెలుచుకున్న నాలుగో పార్టీగా జాతీయస్థాయిలో వైసిపి గుర్తింపు పొందింది. అటువంటి పార్టీలో ఎంపీ స్థానాలకు పోటీ చేయడం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ వైసీపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి మాత్రమే మొగ్గు చూపుతున్నారు. దీంతో వైసీపీలో ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నారు. అయితే ఎంపీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారు ఎగిరి గంతేస్తున్నారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఎంపీలుగా పోటీ చేయమంటే మాత్రం ముందుకు రావడం లేదు. కొందరు ఏకంగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీనిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొత్త వ్యక్తులను తెరపైకి తెస్తున్నారు.గత ఐదేళ్లుగా ఎంపీల పరిస్థితిని గమనించిన వారు పోటీకి ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు జడ్పిటిసి గా ఉన్న ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. కానీ ఈసారి గ్రాఫ్ బాగాలేదని చెప్పి ఎమ్మెల్యే టికెట్ తప్పించారు. కర్నూలు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టారు. ఆయన స్థానంలో అదే నియోజకవర్గంలో జడ్పిటిసి అయిన విరూపాక్షకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీనిని జయరాం జీర్ణించుకోలేకపోతున్నారు. అటు ఎంపీగా పోటీ చేసేందుకు సైతం విముఖత చూపుతున్నారు. ఇస్తే ఎమ్మెల్యే ఇవ్వండి.. లేకుంటే ఎంపీగా పోటీ చేయనని పక్కకు తప్పుకున్నారు. చివరికి జగన్ అక్కడ పాత వ్యక్తికే ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది.
నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం తాను పోటీ చేయలేనని తేల్చేశారు. నాకు ఎంపీ అభ్యర్థిత్వం వద్దు అంటూ విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ నుంచి నేరుగా వచ్చి హైదరాబాదులో చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీంతో ఆయన టిడిపిలో చేరడం దాదాపు ఖరారు అయింది. ఆయనతోపాటు నెల్లూరుకి సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు. అక్కడ వైసీపీ నుంచి టిడిపిలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. అక్కడ పోటీ చేసినా వృధా ప్రయాస అని ఆదాల ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నారు. టిడిపి నుంచి టికెట్ ఆఫర్ వస్తే చేరేందుకు సిద్ధపడుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.
తాజాగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారైన ఉమ్మారెడ్డి వెంకటరమణ సైతం పోటీకి విముఖత చూపుతున్నారు. కనీసం నియోజకవర్గంలో ఎక్కడా ఆయన పర్యటించడం లేదు. ఆయన తండ్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు రెండో నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే అక్కడ విడదల రజనీకి ఖరారు చేశారు. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య అభ్యర్థిత్వాన్ని సైతం ఖరారు చేయలేదు. ఈ పరిణామాల క్రమంలో ఉమ్మారెడ్డి వెంకటరమణ పోటీకి ముందుకు రావడంలేదని తెలుస్తోంది. వైసీపీలో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి మనుషులు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు జరుగుతున్నాయి. దీనిని జగన్ ఎలా అధిగమిస్తారో? గెలుపు గుర్రాలను ఎలా పట్టుకుంటారో? చూడాలి.