Mohammed Siraj Bowling Performance: బుమ్రా గాయపడ్డాడు. ఆకాష్ దీప్ గాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అన్షుల్ కాంబోజ్ కూడా అలానే వ్యవహరించాడు. కానీ మన డిఎస్పి సాబ్ మాత్రం అదరగొట్టాడు. మొదటి టెస్ట్ నుంచి మొదలుపెడితే చివరి టెస్ట్ వరకు అనితర సాధ్యమైన ఆట తీరు కొనసాగిస్తూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో వికెట్లు తీయలేకపోయినప్పటికీ.. అతను మాత్రం ఓవర్లు వేస్తూనే ఉన్నాడు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ సిరాజ్ మాదిరిగానే వరుస ఓవర్లు వేసినప్పటికీ.. భుజం నొప్పితో ఐదో టెస్టు నుంచి పక్కకు తప్పుకున్నాడు. కానీ సిరాజ్ మాత్రం వర్క్ లోడ్ అనే విషయాన్ని కూడా పక్కనపెట్టి జట్టుకు సేవలు అందిస్తున్నాడు.
Also Read: టీమిండియా.. ఇలాగైతే కష్టమే..
ఐదవ టెస్టులో భారత జట్టు 224 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవానికి ఇంగ్లాండ్ పర్యటనలో ఇంతవరకు టీమిండియా అతి తక్కువ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఇదే కావడం విశేషం. దీంతో ఇంగ్లాండ్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సిరాజ్ దూకుడు వల్ల.. ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలి వికెట్ కు ఇంగ్లాండ్ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ జోరును చివరి వరకు కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా పోప్, రూట్, బ్రూక్, బెతెల్ వికెట్లను సిరాజ్ పడగొట్టిన విధానం తొలి ఇన్నింగ్స్ కు హైలెట్ గా నిలిచింది.. హాఫ్ సెంచరీ చేసిన బ్రూక్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండు భారీ స్కోరు కు కళ్లెం పడింది. ఇక తాజా సిరీస్లో సిరాజు ఇప్పటివరకు 14 వికెట్లు పడగొట్టాడు.. ఐదు టెస్టుల్లో కలిపి ఇప్పటివరకు 110+ ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సందర్భాలలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడినప్పటికీ.. అతడు వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేశాడు.
Also Read: 41 ఏళ్ల ఏబీడీ అద్భుతం.. ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికాకు ఊహించని ఫలితం!
ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు సూటి పోటి మాటలతో రెచ్చగొడుతున్న సమయంలో.. టీమిండియా తరఫున సిరాజ్ రెచ్చిపోయాడు. కొన్ని సందర్భాలలో పదునైన బంతులు వేసి ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అంతేకాదు తనదైన వేగంతో బంతులు వేసి అదరగొట్టాడు. తోటి ప్లేయర్లు బుమ్రా నుంచి మొదలు పెడితే ఆకాష్ దీప్ వరకు గాయపడుతూ.. ఇబ్బంది పడుతూ బౌలింగ్ చేస్తుంటే.. సిరాజ్ మాత్రం గాయాలైనా సరే.. శరీరం సహకరించక పోయినా సరే బౌలింగ్ వేస్తున్నాడు . ఎక్కడో హైదరాబాదులో ఒక మారుమూల పేద కుటుంబం నుంచి ఇక్కడిదాకా వచ్చిన సిరాజ్.. తన బౌలింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు.. నిర్విరామమైన క్రికెట్ ఆడుతూ.. జట్టు బౌలింగ్ దళంలో కీలక వ్యక్తిగా మారిపోయాడు.