Mohammed Shami: ఇంత ఘనత ఉంది కాబట్టే మహమ్మద్ షమీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అటువంటి బౌలర్ ఇప్పుడు తేలిపోతున్నాడు. ఐపీఎల్ లో అనామక బౌలర్ లాగా బౌలింగ్ వేస్తున్నాడు. ఇటీవల పంజాబీ జట్టుతో జరిగిన మ్యాచ్లో దారుణంగా పరుగులు ఇచ్చాడు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్ లో స్టోయినీస్ 4 సిక్సర్లు కొట్టడం షమీ బౌలింగ్లో డొల్లతనాన్ని చూపించింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే షమీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చేవి. అభిషేక్ శర్మ ఊర మాస్ ఇన్నింగ్స్ వల్ల షమీ చేసిన తప్పు బయటకి రాలేదు. లేకుంటే అతడికి తదుపరి మ్యాచ్లో అవకాశం దక్కేది కాదు. ఇప్పటికైనా తదుపరి మ్యాచ్లో షమీకి అవకాశం లభించేది కష్టమే. ఎందుకంటే అతని బంతుల్లో లైన్ కనిపించడం లేదు. లెంగ్త్ దర్శనమివ్వడం లేదు. అతని బౌలింగ్లో మామూలు ఆటగాళ్లు కూడా దూకుడుగా ఆడుతున్నారంటే.. అతడి బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఐపీఎల్ లో తక్కువ స్కోరు చేసి.. గెలిచిన జట్లు ఇవే..
ఐపీఎల్ లో.. ఇదా ప్రదర్శన?
షమీపై భారీ అంచనాలు పెట్టుకొని హైదరాబాద్ జట్టు యాజమాన్యం అతడిని కొనుగోలు చేసింది. అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ అతను మాత్రం వాటిని అందుకోలేకపోతున్నాడు. కాలికి గాయం వల్ల.. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల దాదాపు ఏడాదికి పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు షమీ. అయితే అతడి కం బ్యాక్ అంత గొప్పగా లేదు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన అతడు కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. దీనిని బట్టి షమీ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వికెట్లు పడగొట్టకపోయినా.. తక్కువ పరుగులు ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. కానీ అది కూడా షమీ చేయలేకపోతున్నాడు.. అతడిని నమ్మి హైదరాబాద్ మేనేజ్మెంట్ అవకాశాల మీద అవకాశాలు ఇస్తోంది. కానీ అతడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. హర్షల్ పటేల్ వంటి బౌలర్లు తడాఖా చూపిస్తున్న వేదికల మీద షమీ తేలిపోతుండడం అతడి అభిమానులను నిర్వేదానికి గురిచేస్తున్నది. “2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ సూపర్ బౌలింగ్ వేశాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో టీమ్ ఇండియా బౌలింగ్ భారాన్ని మొత్తం అతడేమోశాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో తేలిపోతున్నాడు. అసలు అతని బౌలింగ్ చేస్తుంటే.. వేస్తున్నది షమీ నేనా అనే అనుమానం కలుగుతోంది. బంతుల్లో వేగం కనిపించడం లేదు. వైవిధ్యం కనిపించడం లేదు. అనామక ఆటగాళ్లు కూడా అతడి బౌలింగ్లో పండగ చేసుకుంటున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇప్పటికైనా షమీ తన బౌలింగ్ ను మార్చుకోవాలి. లేకుంటే ఆ నష్టం జట్టుకు మాత్రమే కాదు.. అతని కెరియర్ పై కూడా ఉంటుందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.