Manav Sutar : అనంతపురంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా – సీ జట్టు 525 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా – బీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తోంది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ అజేయ సెంచరీ తో కొనసాగుతున్నాడు. అన్షుల్ కాంబోజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే అంతకుముందుకు బ్యాటింగ్ చేసిన ఇండియా – సీ జట్టు ఇషాన్ కిషన్(111), మానవ సుతార్ (82), ఇంద్రజిత్ (78), రుతు రాజ్ గైక్వాడ్(58), సాయి సుదర్శన్ (43), రజత్ పాటిదార్(40) మెరుగ బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. అయితే ఈ సందర్భంగా ఒక ఆటగాడి గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో ఇతడు బంతితో మ్యాజిక్ చేశాడు. రెండవ మ్యాచ్లో బ్యాట్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఆటగాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ లలో ఒకడైన రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
దులీప్ ట్రోఫీ లో భాగంగా ఇండియా- సీ జట్టు తరఫున మానవ్ సుతార్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. రెండవ మ్యాచ్ లో తన బ్యాటింగ్ నైపుణ్యంతో అదరగొట్టాడు.. ఏడవ నెంబర్ లో బ్యాటింగ్ వచ్చిన అతడు 82 పరుగులు చేశాడు. త్రుటిలో సెంచరీ కోల్పోయినప్పటికీ.. అతడి ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ స్టైల్ చూసిన సీనియర్ ఆటగాళ్లు.. భారత జట్టుకు మరో ఆల్ రౌండర్ దొరికాడని వ్యాఖ్యనిస్తున్నారు.
తొలి మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో మానవ్ సుతార్ దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లను అవుట్ చేశాడు. తన మ్యాజికల్ స్పిన్ బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు సొంతం చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు మానవ్ 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 22.90 సగటుతో 73 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో అతడి హైయెస్ట్ స్కోర్ 96. కాగా ఇప్పటివరకు 508 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ వేయడం మానవ్ ప్రధాన బలం.. తనదైన రోజు బంతితో అద్భుతాలు చేస్తాడు. బ్యాట్ తో పరాక్రమం ప్రదర్శిస్తాడు. అతడిని గనుక జాతీయ జట్టులోకి తీసుకుంటే రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” అతడి బౌలింగ్ స్టైల్ బాగుంది. బ్యాటింగ్ చేస్తున్న విధానం బాగుంది. మెలి తిప్పే బంతులు వేస్తూ మాయ చేస్తున్నాడు. బ్యాటింగ్ లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టకుండా ధాటిగా ఆడుతున్నాడు. ఇలాంటి ఆటగాళ్లు టీమిండియా జాతీయ జట్టుకు చాలా అవసరమని.. భవిష్యత్తు అవసరాలను వీరు తీర్చగలరని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు..