LSG vs DC : విశాఖపట్నం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది..మార్ష్(72), నికోలస్ పూరన్(75) విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడంతో 209 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు బౌలర్లలో స్టార్క్ (3/42) మూడు వికెట్లు పడగొట్టాడు. కులదీప్ యాదవ్ (2/20) రెండు వికెట్లు సాధించాడు.. నిగమ్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్నో జట్టు విధించిన 210 పరుగుల టార్గెట్ ను 19.3 ఓవర్లలో ఢిల్లీ జట్టు చేదించింది. ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో అశుతోష్ శర్మ(Ashutosh Sharma) (66), విప్రాజ్ నిగమ్(Vipraj Nigam)(39), ట్రిస్టన్ స్టబ్స్ (Tristen Stubbs)(34) రాణించారు. వాస్తవానికి లక్నో విధించిన 210 టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టు శార్దుల్ ఠాకూర్ (2/19), సిద్ధార్థ (2/39) ధాటికి ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డూ ప్లె సిస్(29), అక్షర్ పటేల్ (22) సమయోచితంగా ఆడటంతో ఢిల్లీ జట్టు కాస్త కుదురుకుంది. ఆ తర్వాత కీలక సమయంలో వికెట్లు కోల్పోయినప్పటికీ ఆశుతోష్ శర్మ కడ దాకా నిలబడటంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.
Also Read : ఐపీఎల్ లో హై వోల్టేజ్ మ్యాచ్.. రెండు జట్లకూ జీవన్మరణ సమస్యే..
గెలుస్తుందని అనుకోలేదు
ఏడు పరుగులకే మెక్ గూర్క్(1), అభిషేక్ పోరెల్(0), సమీర్ రిజ్వి (4) ఇలా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో ఢిల్లీ జట్టు (Delhi capitals) విజయంపై ఎవరికీ ఎటువంటి నమ్మకాలు లేవు. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్, డూ ప్లెసిస్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రవ్ నిగమ్(39) బాధ్యతాయుతంగా, దూకుడుగా ఆడటంతో ఢిల్లీ జట్టు గెలిచింది. కీలక సందర్భాల్లో లక్నో ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యం.. బౌలింగ్ వైఫల్యం కూడా ఢిల్లీ జట్టుకు కలిసి వచ్చింది. ఒకవైపు ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ.. చేయాల్సిన పరుగులు పెరిగిపోతున్నప్పటికీ ఢిల్లీ ప్లేయర్లు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆడటం విశేషం. ఇక ఒత్తిడిలో లక్నో జట్టు ఆటగాళ్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీంతో ఢిల్లీ జట్టు విజయం ఖాయమైంది. ముఖ్యంగా షాబాజ్ అహ్మద్(0/22), రవి బిష్ణోయ్ (2/53) ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఢిల్లీ జట్టు ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. ఒకవేళ వీరిద్దరు గనుక కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ జట్టు ఓడింది అనడం కంటే.. లక్నో జట్టు చేతులారా ఓటమిని తెచ్చుకుంది అని అనడం సబబు. ఢిల్లీ జట్టు విజయంలో అశుతోష్ శర్మ ముఖ్యపాత్ర పోషించాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే ఢిల్లీ జట్టు గెలిచి ఉండేదే కాదు. అతడి వికెట్ చేయడానికి లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read : ఎంపైర్ తో మ్యాచ్ మధ్యలో రిషబ్ పంత్ వాగ్వాదం .. దుమారం