Homeక్రీడలుIndian Cricketer Robin Singh: క్రికెట్‌ శిఖరాన్ని దేశం ఎందుకు మర్చిపోయింది?

Indian Cricketer Robin Singh: క్రికెట్‌ శిఖరాన్ని దేశం ఎందుకు మర్చిపోయింది?

Indian Cricketer Robin Singh: చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తు పెట్టుకుంటుంది ఆ విజేతల మాటున ఎందరో పోరాట యోధులు చరిత్రలో కనుమరుగైపోతుంటారు. వారి పేరు చరిత్ర మర్చిపోవచ్చు గానీ, వారి పోరాటాన్ని మాత్రం అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. అలా క్రికెట్‌ చరిత్రలో కనుమరుగైన పోరాట యోధుడు రబింద్ర రామ్‌ నారాయణ్‌ సింగ్‌.. క్రీడాభిమానులందరూ ముద్దుగా రాబిన్‌ సింగ్‌.. అని పిలుచుకుంటారు. సచిన్, గంగూలీ, కపిల్‌ దేవ్‌ లాంటి.. ఆటగాళ్ల మానియాలో, రాబిన్‌ సింగ్‌ అద్భుతమైన ఎన్నో ఇన్నింగ్స్‌లు చరిత్రలో కలిసిపోయాయి. మరపురాని మెరుపు లాంటి ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు రాబిన్‌సింగ్‌.

ఫీల్డింగ్‌లో మెరిక..
1990వ దశకంలో సచిన్, గంగూలీ లాంటి హేమాహేమీలతో భారత్‌ బ్యాటింగ్‌ బలంగా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం మనం పసికూనలమే. కవర్స్‌లో ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బాల్‌ వెళ్తుంటే చేయి లేపి బౌండరీ లైన్‌ ఫీల్డర్‌ను అలర్ట్‌ చేయడం అలవాటు పడ్డ టీమిండియా.. తొలిసారి పక్కకు డైవ్‌ చేస్తూ.. బాల్‌ను ఆపే ఫీల్డర్‌ను చూసింది.. అతనే రాబిన్‌సింగ్‌. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కొత్త ఒరవడి సష్టించాడు.

బౌలింగ్‌లో ప్రతిభ..
1999 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు రాణించకపోయినా.. ఓటమి తలపుతట్టేలా ఉన్న సమయంలో బంతి అందుకున్న రాబిన్‌సింగ్‌ హ్యాట్రిక్‌తో అద్భుతం చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్లు కూల్చి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

బ్యాటింగ్‌లోనూ సత్తా..
బాల్‌తోనే కాదు.. ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్‌ పవర్‌ కూడా చూపించాడు. 100 పరుగులలోపే 4 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో షేన్‌ వార్న్‌ లాంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కొవడమే కాకుండా.. అతని ఓవర్‌లో ఏకంగా మూడు భారీ సిక్సులు కొట్టి.. ఆస్ట్రేలియాకే షాక్‌ ఇచ్చాడు. ఇలా అనేక సందర్భాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో టీమిండియాకు అపద్బాంధవుడిలా మారాడు.

రాబిన్‌కు ముందు ఆ ఇద్దరే..
రాబిన్‌ రాక ముందు.. ఆడితే సచిన్‌ లేదంటే గంగూలీ.. బౌలింగ్‌ వేస్తే శ్రీనాథ్, వెంకటేశ్‌ ప్రసాద్‌ లేదంటే కుంబ్లే. ఇలా ఉన్న టీమిండియాకు రాబిన్‌సింగ్‌ ఒక ఆణిముత్యంలా దొరికాడు. జట్టు 4, 5 వికెట్లు కోల్పోయినా ప్రత్యర్థి టీమ్‌కు వణుకుపుట్టించేవాడు రాబిన్‌సింగ్‌. మూడు విభాగాల్లోనూ అద్భుతాలు చేసిన రాబిన్‌సింగ్‌లోని మరో స్పెషల్‌ టాలెంట్‌ ఏంటంటే.. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక విభాగంలో అద్భుత ప్రదర్శన ఇస్తాడు. జట్టులో అతనుంటే బ్యాటర్, బౌలర్, ఫీల్డర్‌ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉన్నట్లే.

టెస్టు జట్టులో దక్కని చోటు..
వన్డేల్లో అప్పటి వరకు టీమిండియా చూడని ఒక ఆటగాడిగా ఎదిగిన రాబిన్‌సింగ్‌ టెస్ట్‌ జట్టులో మాత్రం స్థానం సంపాదించుకోలేక.. తన కేరీర్‌లో ఒకేఒక్క టెస్ట్‌ మ్యాచ్‌కు పరిమితం చేసుకున్నాడు. మెగ్రాత్, బ్రెట్‌లీ, గిలెస్పీ, షేన్‌వార్న్‌ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటూ.. ఆస్ట్రేలియాపై 1999లో 30 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్‌ ఇప్పటికీ ఓ మరపురాని సంఘటనే. ఇంతటి ఘనత వహించిన రాబిన్‌కు మాత్రం రావాల్సినంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి. సచిన్, గంగూలీ, అజారుద్దీన్‌ లాంటి ఆటగాళ్ల మాటున రాబిన్‌సింగ్‌ అనే పోరాట శిఖరం కనుమరుగు కాక తప్పలేదు. సోషల్‌ మీడియా వాడకం పెరిగాక.. సచిన్, కోహ్లీ, ధోని లాంటి ఆటగాళ్లకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. అప్పట్లో ఇంతలా సోషల్‌ మీడియా లేదు. దీంతో ఓ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సాధారణ ఆటగాడిగా మిగిలిపోవాల్సి వచ్చింది.

వివిధ విభాగాల్లో కోచ్‌గా..
తన రిటైర్మెంట్‌ తర్వాత రాబిన్‌సింగ్‌ టీమిండియాకు పలు విభాగాల్లో కోచ్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో ముంబాయి ఇండియన్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్, బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యహరించి.. ముంబాయి ఐపీఎల్‌ కప్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించాడు.

రాబిన్‌సింగ్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 136 వన్డేలు ఆడి 2,336 పరుగులు చేశాడు. అలాగే 69 వికెట్లు తీసుకున్నాడు. ఇక రాబిన్‌సింగ్‌ గురించి తెలిసిన వారు మాత్రం సచిన్, ధోని, కోహ్లీ కన్నా రాబిన్‌ సింగే గొప్ప ఆటగాడు అంటూ కితాబిస్తున్నారు. ఇన్ని ఘనతలు సాధించిన రాబిన్‌సింగ్‌ చివరికి దేశం మరచిపోయిన గొప్ప ఆటగాడిగానే మిగిలిపోయాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version