Lauren Bell: నలుపు, బంగారు వర్ణంలో ఉన్న జుట్టు.. దాదాపు ఆరడుగుల ఎత్తు.. బంతి చేతిలో పట్టుకొని అంత దూరం నుంచి పరుగులు పెట్టుకొని వేగంగా విసరుతుంటే.. ప్రత్యర్థి బ్యాటర్లు చూస్తుండగానే పెవిలియన్ వైపు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగుసార్లు.. దీంతో ఆమె లక్కీ చాంప్ అయిపోయింది. బెంగళూరు జట్టుకు విన్నింగ్ హ్యాండ్ గా మారిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో షేక్ చేస్తూ.. కోట్లాదిమంది యువకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్లో బెంగళూరు జట్టు విజయ యాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి తదుపరి దశలోకి విజయవంతంగా అడుగు పెట్టింది. ఇదే జోరు కొనసాగించి.. ట్రోఫీ ని మరోసారి అందుకోవాలని గట్టి ఆశతో ఉంది. బెంగళూరు జట్టును స్మృతి మందాన ముందుండి నడిపిస్తున్నారు. అయితే బ్యాటింగ్లో ఆమె జోరు చూపిస్తుంటే.. బౌలింగ్లో మాత్రం లారెన్ బెల్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ప్రత్యర్థులను 154 కు మించి పరుగులు చేయలేదంటే లారెన్ బెల్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో అమేలీయ కేర్ తో పేస్ దాడిని ప్రారంభించిన లారెన్.. ఆ తర్వాత బెంగళూరు జట్టుకు వజ్రాయుధం లాగా మారింది. తనకు మాత్రమే సాధ్యమైన డెలివరీలను వేస్తూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. పరుగుల వరద పారే టి20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేస్తోంది. ప్రస్తుత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో లారెన్ ఎకనామి రేటు 5.31 అంటే.. ఆమె బౌలింగ్ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
బెల్ వేగవంతమైన బౌలర్ మాత్రమే కాదు.. అంతకుమించిన అందగత్తె కూడా. సోషల్ మీడియాలో ఆమెను లక్షల మంది అనుసరిస్తుంటారు. పైగా మైదానంలో అత్యంత చిలిపి హావ భావాలను ఆమె ప్రదర్శిస్తూ ఉంటుంది. అది బెంగళూరు అభిమానులను మాత్రమే కాదు, యావత్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. అందువల్లే ఆమెకు చాలామంది తమ హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని కల్పించారు..
శనివారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో లారెన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టింది. తద్వారా బెంగళూరు జట్టుకు తిరుగులేని అడ్వాంటేజ్ ను అందించింది. వాస్తవానికి ఇలాంటి ఆరంభాన్ని అందివ్వడం లారెన్ కు తొలిసారి కాకపోయినాప్పటికీ.. పదేపదే అదే ఘనతను కొనసాగించడం మాత్రం ఒకరకంగా అద్భుతం అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
