Chinnaswamy Stadium: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ స్టేడియాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. గత ఏడాది ఐపీఎల్ సాధించిన తర్వాత బెంగళూరు జట్టు విజయ్ పరేడ్ నిర్వహించింది. దీనిని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిపింది. ఆ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని చాలామంది చనిపోయారు. భారీగా అభిమానులు గాయపడ్డారు. ఇదంతా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ చరిత్రలో మాయని మచ్చలాగా మిగిలిపోయింది.
ఈ ఉదంతం జరిగిన తర్వాత పోలీస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం వరకు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు అరెస్టు కూడా అయ్యారు. దీంతో 2026 ఐపిఎల్ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరిగే విషయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం లేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బెంగళూరు అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన గుండె పగిలిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో కర్ణాటక మంత్రివర్గం సమావేశమైంది.. చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే విషయంపై క్లారిటీ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. అయితే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు వెంకటేష్ ప్రసాద్ అధ్యక్షుడయ్యారు. ఐపీఎల్ మ్యాచ్ లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను కర్ణాటక రాష్ట్ర మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించుకునే విధంగా అనుమతులు మంజూరు చేశారు. దీంతో కర్ణాటక జట్టు క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పురుషుల టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. దీంతో, చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే జరుగుతాయి. ఒకవేళ ఐపిఎల్ తర్వాత ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో పరిగణలోకి తీసుకుంటే మాత్రం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరిగే అవకాశం ఉంటుంది.
