Devdutt Padikkal: అతడు బ్యాట్ పడితే ఎంతటి బౌలర్ అయినా భయపడాల్సిందే. ముందుకొచ్చి కొడితే ఎంతటి పదునైన బంతయినా బౌండరీ దాటాల్సిందే. స్వీప్ షాట్ కొడితే ఫీల్డర్లు చెమటోడ్చాల్సిందే. అలాంటి బ్యాటరీ ఎప్పుడు ఇండియన్ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ జట్టుతో రాజ్ కోట్ లో జరిగే మూడవ టెస్టులో ఆరం గేట్రం చేయనున్నాడు.. దీంతో అతని పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. ఇంతకీ ఆటగాడు ఎవరంటే..
కర్ణాటక కు చెందిన దేవ దత్ పడిక్కల్ దేశవాళీ క్రికెట్లో మంచినీళ్ళు తాగినంత సులభంగా సెంచరీలు కొడుతున్నాడు. రంజీ ట్రోఫీ సీజన్లో కర్ణాటక తరఫున అతడు అదరగొడుతున్నాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీ శతకం సాధించాడు. గోవా తో జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఊపు కొనసాగించాడు. ఏకంగా సెంచరీ బాదాడు. ఇక్కడితోనే అతడు ఊరుకోలేదు. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ లోనూ సెంచరీ సాధించాడు. ఇక అతడు తన చివరి ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అంటే బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రంజి సీజన్లో 4 మ్యాచ్ లు ఆడి 92.67 సగటుతో ఏకంగా 556 పరుగులు చేశాడు. అదే కాదు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు.
ఇక ఇదే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఎల్ రాహుల్ గాయం కారణంగా కర్ణాటకలో జరుగుతున్న 5 టెస్ట్ ల సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో పడిక్కల్ కు జట్టులోకి రావాలని ఆహ్వానం అందింది. తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కిందంటూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. గాయంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ ను బోర్డు మెడికల్ టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో అతడు కోరుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ ఆరోగ్యం సహకరిస్తే అతడు నాలుగవ టెస్టుకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వివరించింది. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో పడిక్కల్ ను ఎంపిక చేసామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ పేర్కొంది..
పడిక్కల్ ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ కెరియర్లో 31 మ్యాచ్ లు ఆడాడు. 2,227 పరుగులు చేశాడు. భారత జట్టు తరఫున 2021 లో టీ_20 ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు అతడికి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు భారత జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా తన ఫామ్ దొరకబుచ్చుకున్నాడు. విధ్వంసకరమైన ఆటతీరుతో సెలక్టర్ల మనసు దోచుకున్నాడు. గాయం వల్ల ఇన్నాళ్లు ఆటకు దూరమైన అతడు.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు.