KL Rahul: పెర్త్ టెస్ట్ తర్వాత.. టీమిండియా అడిలైడ్ లో తేలిపోయింది. గబ్బా లో ఎదురీదుతోంది. వర్షం వల్ల టీమ్ ఇండియా దాదాపు ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది.. ఈ వర్షం గనుక కురువకపోతే మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియాకు కచ్చితంగా వ్యతిరేకంగా ఉండేది. వాస్తవానికి మ్యాచ్ జరిగిన ఆ కాస్త సమయంలో కూడా వికెట్లు పడిపోయాయి. గిల్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు చేతులెత్తేశారు. కనీసం రెండంకెల స్కోర్ చేయడానికి కూడా ఇష్టం లేనట్టుగా పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో టీమిండియా కు ఆపద్బాంధవుడుగా నిలిచాడు కేఎల్ రాహుల్. క్రీజ్ కు పాతుకుపోయి.. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని.. తనలో ఉన్న బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. రాహుల్ ద్రావిడ్, పూజారా ను గుర్తు చేశాడు.. ఇటీవల తన స్థానం ప్రశ్నార్థకం కావడంతో ఆత్మ పరిశీలనలో పడ్డ రాహుల్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జూరెల్ వంటి వారి నుంచి ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ.. తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా అతడు ఆడుతున్నాడు.. కేఎల్ రాహుల్ పై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచడంతో.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ.. అతడు మాత్రం సుస్థిరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా పరువు నిలుపుతున్నాడు.. అంతేకాదు ఆస్ట్రేలియా కు కంచుకోట లాగా ఉన్న గబ్బాలో టీమిండియా కు ఫాలో ఆన్ గండం లేకుండా ఉండేందుకు.. ఏకంగా 84 పరుగుల అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
అదే అతడి రహస్యం
రెడ్ బాల్ లో “కుక బుర్ర” విచిత్రంగా ఉంటుంది. ఆస్ట్రేలియా లాంటి పేస్ మైదానాలపై అమాంతం దూసుకు వస్తుంది. ఇలాంటి బంతి త్వరగా స్వింగ్ అవుతుంది. అలాంటప్పుడు 30 ఓవర్ల పాటు బంతి పాతపడితే చాలు.. పేపర్లు పండగ చేసుకోవచ్చు. అయితే ఇలా 30 ఓవర్లు పూర్తయ్య సరికే భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో రాహుల్ మాత్రం నిదానంగా ఆడాడు. తొందరపడకుండా బంతిని పాతపడే విధంగా చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలాంటి శైలిని అయితే అనుసరించారో.. దానిని అతడు కూడా కొనసాగించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్ సైడ్ వేసిన బంతులను శరీరానికి దగ్గరగా ఆడాడు రాహుల్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చేసిన తప్పులను.. అతడు చేయలేదు.. ఇక సెనా(సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా) దేశాలలో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ.. సరికొత్త రికార్డును తన పేరు మీద ఉండేలా చూసుకుంటున్నాడు రాహుల్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్ లాంటి ఆటగాళ్లు నియంత్రణ కోల్పోతున్నచోట.. అతడు మాత్రం స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అత్యంత ఒత్తిడిలోనూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. స్థూలంగా చెప్పాలంటే రాహుల్.. రాహుల్ ద్రావిడ్ ను గుర్తు చేస్తున్నాడు.