Vijay Hazare Trophy Final: ఈ సీజన్లో విదర్భ సారధి కరణ్ నాయర్(Karan Nair) తిరుగులేని ఫామ్ కనబరుచుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఐదు సెంచరీలు చేశాడు. ఆరు ఇన్నింగ్స్ లలో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 112*, 44*, 163*, 112, 122*, 88* పరుగులు చేసి.. విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. బౌలర్లు ఎవరనేది చూడకుండా దూకుడుగా ఆడుతున్నాడు.. కరణ్ నాయర్ అదే ఫామ్ కనుక నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో కొనసాగిస్తే.. కర్ణాటక జట్టుకు కష్టాలు తప్పవు. ఈ టోర్నీలో ఇప్పటివరకు హైయెస్ట్ స్కోరర్ గా రుతు రాజ్ గైక్వాడ్ (660) పరుగులు చేశాడు.. అతడి రికార్డును కూడా నాయర్ బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో ఐదు సెంచరీలు చేసిన నాయర్.. హైయెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా ఆవిర్భవించాడు. ఇప్పటివరకు నాయర్ 752 పరుగులు చేసి ఊపు మీద కనిపిస్తున్నాడు.. ఏడు ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు.. నాయర్ తో పాటు ఓపెనర్లు యశ్ రాథోడ్, ధృవ్ షోరే, వికెట్ కీపర్ జితేష్ శర్మ తిరుగులేని ఫామ్ లో కనిపిస్తున్నారు.
కర్ణాటక జట్టు ఇలా..
కర్ణాటక జట్టు కూడా బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది. దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ వంటి వారు దూకుడు మీద కనిపిస్తున్నారు. వీరు కర్ణాటక జట్టుకు అద్భుతమైన విజయాలు అందించారు. వీరు గనుక ఫైనల్ లో ఇదే తీరుగా ఆడితే విదర్భ జట్టుకు ఇబ్బందులు తప్పవు. బౌలింగ్ పరంగా రెండు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ. ఫైనల్ మ్యాచ్లో వేసే విధానాన్ని బట్టి రెండు జట్లకు గెలిచే అవకాశాలుంటాయి.. అయితే ఇంతవరకు విదర్భ జట్టు విజయ్ హజారే ట్రోఫీని దక్కించుకోలేదు. ఈసారి ఎలాగైనా జట్టుకు ట్రోఫీ అందించాలని కరణ్ లాయర్ భావిస్తున్నాడు. మరోవైపు మయాంక్ ఆధ్వర్యంలో 5వ సారి ట్రోఫీ దక్కించుకోవాలని కర్ణాటక జట్టు భావిస్తోంది.. ఈ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు మొదలవుతుంది. జియో యాప్, స్పోర్ట్స్ 18 ఛానల్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
జాతీయ జట్టులో చోటు లభిస్తుందా..
కరణ్ నాయర్ గతంలో జాతీయ జట్టులో ఆడాడు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం టెస్టు క్రికెట్లో త్రిబుల్ సెంచరీ నమోదు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ రికార్డు సాధించాడు. అయితే ఇప్పుడు అతడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో అతడికి జాతీయ జట్టులో చోటు లభించడం ఖాయమని తెలుస్తోంది. అయితే అతడి వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. అయినప్పటికీ యువకులతో ధీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ధాటిగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే అతడికి ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో చోటు దక్కితే బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల టెస్ట్ క్రికెట్లో టీమిండియా సరైన ఆటతీరు ప్రదర్శించలేకపోతోంది. అతడికి గనక చోటు దక్కితే తిరుగుండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.