Kapil Dev: వరక్తం ఎక్కిస్తానంటూ టీమిండియాలో అనేక మార్పులు తీసుకొచ్చాడు గౌతమ్ గంభీర్.. మిగతా ఫార్మాట్ ల విషయం కాస్త పక్కన పెడితే.. టెస్టులలో మాత్రం అతడు చేసిన ప్రయోగం అత్యంత ఘోరమైన ఫలితాలను ఇచ్చింది. తద్వారా టీమ్ ఇండియా పరువు గంగలో కలిసి పోతోంది. వరుస ఓటములు ఎదుర్కొంటున్నప్పటికీ మేనేజ్మెంట్ మారడం లేదు. కోచ్ వ్యవహార శైలి గాడిలో పడడం లేదు.
టీమిండియా స్వదేశం వేదికగా ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో టీమ్ ఇండియా దారుణమైన ఓటమికి గురైంది. టీమిండియా ఇంత దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న తర్వాత మాజీ ప్లేయర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో టీమిడియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా చేరిపోయారు. కపిల్ దేవ్ సౌత్ ఆఫ్రికా జట్టు చేతిలో టీమిండియా ఓడిపోవడం పట్ల కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
“స్పిన్, సీమ్ పిచ్ ల మీద ఆడాలంటే ఓపిక చాలా ఉండాలి. ఎక్కువసేపు క్రీజ్ లో ఎలా నిలబడాలో తెలిసి ఉండాలి. సహనంతో బ్యాటింగ్ చేయాలి. ప్రతి బంతిని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. చెత్త బంతిని బౌండరీ వైపు తరలించాలి. పరుగులు సాధించడంలో క్రియాశీల విధానాన్ని అవలంబించాలి. ఇవన్నీ తెలుసు కాబట్టి రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం టీమిండియాలో అటువంటి ప్లేయర్లు లేరు. టెస్టులలో బ్యాటింగ్ చేయాలంటే ముఖ్యంగా ఓపిక ఉండాలి. క్రీజ్ లో నిలబడాలి.. ఇప్పుడున్న ప్లేయర్లలో ఎంతమంది దేశవాళి క్రికెట్ ఆడుతున్నారని” కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.
కపిల్ దేవ్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా అన్ని వేళ్ళూ గౌతమ్ గంభీర్ వైపు చూపించడం మొదలైంది. అడ్డమైన ప్రయోగాలు చేసి టీమ్ ఇండియా టెస్ట్ దళం బలాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు. దీంతో టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల పై మినహా మిగతా ఏ జట్లపై కూడా ట్రోఫీలు సాధించలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ సమం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టుతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను దారుణంగా కోల్పోయింది. కపిల్ దేవ్ నేరుగా ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి గౌతమ్ గంభీర్ కు ఏర్పడింది.