Jasprit Bumra: బుమ్రా సరికొత్త చరిత్ర.. ఐపీఎల్ లో ఏకైక బౌలర్ గా అరుదైన ఘనత..

ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్న జస్ ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడాడు. ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. మెరుగ్గా వికెట్లు తీయకపోయినప్పటికీ అతడి ఎకానమీ ఆరులోపే ఉందంటే.. బౌలింగ్ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 8:33 am

Jasprit Bumra

Follow us on

Jasprit Bumra: అతడు బంతి వేస్తే మెరుపు వేగంతో దూసుకొస్తుంది. బ్యాటర్ అంచనా వేయకపోతే బుల్లెట్ స్పీడుతో వికెట్లను పడగొడుతుంది. అందుకే అతడిని భారత పేస్ గుర్రం అని పిలుస్తారు. యార్కర్లు సంధించడంలో అతనికి అతడే సాటి. నిప్పులు చెరిగే బంతులు వేయడంలో లేరు ఎవరూ అతడికి పోటీ. అందుకే సంవత్సరాలుగా భారత ఏస్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. వేగానికి కొలమానమైన ఐపీఎల్ లోనూ అతడు మెరుపులు మెరిపిస్తున్నాడు. గురువారం రాత్రి బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లోనూ బుమ్రా అదరగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఎవరూ అందుకోలేని ఆరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్న జస్ ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడాడు. ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. మెరుగ్గా వికెట్లు తీయకపోయినప్పటికీ అతడి ఎకానమీ ఆరులోపే ఉందంటే.. బౌలింగ్ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పొట్టి ఫార్మాట్ లో ఎంత పెద్ద తోపు బౌలర్ అయినా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తూ ఉంటాడు. వేగానికి కొలమానమైన ఐపీఎల్ లో బ్యాటర్లు దూకుడుకే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు ఎంత పెద్ద బౌలర్ అయినా లెక్కచేయరు. పైగా ఎదురు దాడికి దిగుతారు. దీనివల్ల బౌలర్ తన లయ కోల్పోతాడు. ఒత్తిడిలో గతి తప్పిన బంతులు వేస్తూ చేతులు ఎత్తేస్తాడు. కానీ జస్ ప్రీత్ బుమ్రా ఇందుకు విరుద్ధం. తన బౌలింగ్ మీద ఏమాత్రం పట్టుకోల్పోడు. వేసే బంతుల విషయంలో గురిని అస్సలు మిస్ కాడు.

ఇక ఈ ఐపీఎల్ లో జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో బ్యాటర్లు పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడుతున్నారు. మిగతా బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. అందుకే జస్ ప్రీత్ బుమ్రా కసి తో బౌలింగ్ చేస్తున్నాడు. తన కోపాన్ని బెంగళూరు జట్టు మీద గురువారం చూపించాడు. ఆ టీం తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో జస్ ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ పరాక్రమాన్ని చూపించాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి బెంగళూరు పతనాన్ని శాసించాడు. బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీతో తన వికెట్ల వేటను షురూ చేశాడు. ఆ తర్వాత అలా నలుగురిని అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు. ఈ మ్యాచ్ ద్వారా జస్ ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (3)ని అద్భుతమైన బంతితో అవుట్ చేసిన జస్ ప్రీత్ బుమ్రా.. అనంతరం బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్(61) ను కూడా బోల్తా కొట్టించాడు. ఇక ఇన్వెస్ట్ చివరిలో మహిపాల్ లోమ్రోర్(0), సౌరవ్ చౌహన్ (9), వైశాఖ విజయ్ కుమార్ (0) ను వెనక్కి పంపాడు. ఐదుగురిని అవుట్ చేయడం ద్వారా 5 వికెట్ హాల్ సొంతం చేసుకున్నాడు. ఈ వికెట్లు తీయడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు మూడు వికెట్లు తీసిన మరో అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఐపీఎల్ లో మూడు వికెట్లు తీయడం జస్ ప్రీత్ బుమ్రా కు ఇది 20వసారి. ఈ జాబితాలో మొదటి స్థానంలో లశిత్ మలింగ(19 సార్లు) ను బ్రేక్ చేశాడు. అంతేకాదు బెంగళూరు పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా అవతరించాడు.. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన జస్ ప్రీత్ బుమ్రా 21 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.