Jaspreet Bumrah : గడచిన మూడు సీజన్లలో ముంబై జట్టు పెద్దగా ప్రతిభ చూపిన దాఖలాలు లేవు. అందువల్లే గత సీజన్లో ముంబై జట్టు మేనేజ్మెంట్ కెప్టెన్ ను మార్చేసింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో విజేతగా ఆవిర్భవించింది. 2023లో రన్నరప్ గా నిలిచింది. ఇక హార్థిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత కూడా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. గత సీజన్లో ముంబై జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, బుమ్రా వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పైగా జట్టులో నెలకొన్న అంతర్గత విభేదాలు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇపుడు కూడా ముంబై జట్టు చెప్పుకోదగ స్థాయిలో విజయాలు సాధించ లేకపోతోంది. రోహిత్ లాంటి ఆటగాడు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి క్రమంలో బుమ్రా కూడా లేకపోవడం ముంబై జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?
అతడు వస్తున్నాడు
బుమ్రా లేకపోవడంతో ముంబై జట్టు బౌలింగ్ దళం అంతగా బలం సంతరించుకోలేకపోతోంది. దీపక్ చాహర్, అశ్వని కుమార్, బౌల్ట్, విగ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. కొన్ని మ్యాచ్లలో అంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు.. అయితే అంతంత మాత్రం బలంతో ఉన్న ముంబై జట్టు బౌలింగ్ దళంలోకి బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టినప్పటికీ.. ఒకప్పటి లాగా అతడు బౌలింగ్ వేయలేకపోతున్నాడు. దీనికి తోడు వేస్తున్న బంతుల్లో కూడా లయ కనిపించడం లేదు. దీంతో అతడికి కొంతకాలం పాటు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావించినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బుమ్రా మరో రెండు మ్యాచ్ల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈలోగా అతడు తుది దశ సామర్ధ్య పరీక్షల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. ” బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు. గతంతో పోల్చితే అతని బౌలింగ్ మరింత మెరుగైంది. రెండు రోజుల క్రితం అతడు వేగంగా బంతులు వేయలేకపోయాడు. ఇప్పుడు మాత్రం పూర్తి లయను అందుకున్నట్టు తెలుస్తోంది. తుది సామర్ధ్య పరీక్షల్లో అతడు విజయం సాధించిన తర్వాత జట్టులోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అతడు జట్టులోకి వస్తే బౌలింగ్ దళం మరింత బలం పెంచుకుంటుందని” ముంబై ఇండియన్స్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : ఈ ముగ్గురికి ఏమైంది.. మరీ సింగిల్ డిజిటా?