Jason Gillespie: ఇన్నాళ్లు ఆ జట్టులో ఆటగాళ్ల ఆట తీరుపై విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా ఆ స్థానంలో కోచ్ లు కూడా చేరినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో గడచిన నాలుగు సంవత్సరాలలో ఆరుగురు కోచ్ లు మారారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కిర్ స్టెన్ తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు ఆ బాటలో గిలెస్పీ చేరాడు. నాడు కిర్ స్టెన్ చేసినట్టుగానే.. ఇప్పుడు గిలెస్పి కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ” అక్కడ మనం అనుకున్నట్టుగా ఉండదు. మనం చెప్పినట్టుగా జరగదు. మార్పులు కోరుకుంటాం.. అక్కడ అలాంటివి జరగవు. ఎవరు ఎలా వ్యవహరిస్తారో అర్థం కాదు. ఎందుకు అలా చేస్తున్నారు కొరుకుడు పడదు. చేతిలో అధికారం ఉన్నట్టే అనిపిస్తుంది. దానిద్వారా ఏదో చేయాలని అనుకుంటే మన మూర్ఖత్వమే అవుతుంది. ఇది నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టే దూరం జరగాల్సి వస్తోంది.. ఇకపై ఏం జరుగుతుందో చెప్పలేను గానీ.. ఇప్పటికైతే నా పదవికి రాజీనామా చేశానని” గిలెస్పీ వ్యాఖ్యానించాడు. గతంలో కిర్స్టెన్ కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశాడు. జట్టులో ఐకమత్యం ఉండదని.. జట్టు మేనేజ్మెంట్ దానిని ప్రతిబింబించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆరోపించాడు. ఇప్పుడు గిలెస్పి కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహార శైలి చర్చానీయాంశంగా మారింది.
తదుపరి కోచ్ ఎవరు?
గిలెస్పీ రాజీనామా తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన తదుపరి తాత్కాలిక కోచ్ గా అకిబ్ జావిద్ ను నియమించింది. అతడు కిర్స్టెన్ వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక వైట్ బాల్ కోచ్ గా నియమితుడయ్యాడు. ఇప్పుడు రెడ్ బాల్ కు కూడా కోచ్ గా వ్యవహరించనున్నాడు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. దానికి ఆకిబ్ జావేద్ కోచ్ గా వ్యవహరిస్తాడు. గిలెస్పీ సారధ్యంలో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచింది. అంతకుముందు బంగ్లాదేశ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ పై గెలిచిన అనంతరం పాకిస్తాన్ జట్టు లో ఉత్సాహం ఉరకలు వేసింది. కానీ గిలెస్పీ రాజీనామా చేయడంతో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. అయితే ఈ ప్రభావం జట్టు మీద ఉండదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ మెరుగ్గా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మేనేజ్మెంట్లో చోటు చేసుకున్న పరిణామాలపై విలేకరులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. పి సి బి అధికారులు సమాధానాన్ని దాటవేశారు.
విదేశీ కోచ్ లకు పాకిస్తాన్ ఆటగాళ్లు సహకరించరనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కోచ్ చెప్పింది వినిపించుకోకుండా.. తాము ఏం చేయాలో అది చేస్తారని.. అందువల్లే జట్టు అలా మారిందని గతంలో పాకిస్తాన్ మీడియా రాసింది. అయినప్పటికీ ఆ దేశ ఆటగాళ్ల తీరు మారలేదు. పైగా వారి వ్యవహార శైలి మరింత అద్వానంగా మారింది. అందువల్లే విదేశీ కోచ్ లు దీర్ఘకాలం పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం సాగించలేకపోతున్నారు.