Yashasvi Jaiswal: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆల్ అవుట్ అయిన ఇండియా.. ఇంగ్లాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు కట్టడి చేసింది.. తద్వారా 126 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 19 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ జో రూట్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి ఇండియా స్కోరు 30 పరుగులు మాత్రమే.
దీంతో మరో యశస్వి జైస్వాల్ వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో పది పరుగులకే అవుట్ అయిన జై స్వాల్.. ఈసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఆడాడు. డిఫెన్స్ ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. కొన్ని సిక్సులుగా మలిచాడు. మొత్తానికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు ఐదు సిక్స్ ల సహాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. 50 పరుగుల వరకు నెమ్మదిగా ఆడిన జై స్వాల్.. తర్వాత స్పీడ్ పెంచాడు.. రెండవ టెస్టులో డబుల్ సెంచరీ తో అదరగొట్టిన ఈ యంగ్ ఓపెనర్.. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.
30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన నేపథ్యంలో గిల్ తో కలిసి జైస్వాల్ సమయోచితంగా ఆడాడు. జై స్వాల్ మెరుపులు మెరిపిస్తుంటే.. గిల్ నిదానంగా ఆడాడు. ఈ దశలోనే గిల్ 5 ఫోర్లు, రెండు సిక్స్ ల సహాయంతో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ సెంచరీ చేసిన నేపథ్యంలో అతనిపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..కాగా,104 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఇండియా ఇంగ్లాండ్ పై 315 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.