Virat Kohli Rohit Sharma: రాంచీ మ్యాచ్లో 349 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా జట్టు పై ఉత్కంఠ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను ఘనంగా ప్రారంభించింది. రాంచి మైదానంలో రోహిత్, విరాట్ వీర విహారం చేశారు. రోహిత్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకుంటే.. విరాట్ శతకంతో గర్జన చేశాడు.
చాలా రోజుల తర్వాత విరాట్ సెంచరీ చేయడంతో రాంచీ మైదానం ఊగిపోయింది. అభిమానులు కేరింతలు కొట్టారు. కోహ్లీ కోహ్లీ అంటూ విరాట్ నామాన్ని జపించారు. సెంచరీ చేసిన తర్వాత విరాట్ అమాంతం ఎగిరి.. అభిమానులకు అభివాదం చేయడంతో.. ఆ దృశ్యం ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. అన్ని మాధ్యమాలలో రికార్డు స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది.
విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత అతడి సోదరి భవాని కోహ్లీ IYkYK అని సోషల్ మీడియాలో రాసుకువచ్చారు. IYkYK దీనికి అర్థం ఇఫ్ యు నో, యునో. “కేవలం జ్ఞానం ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుందని” దీని అర్థం. విరాట్ సోదరి పెట్టిన స్టేటస్ ను చాలా స్క్రీన్ షాట్ లు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ పై, విరాట్ కోహ్లీపై కొంతకాలంగా చాలామంది విమర్శలు చేస్తున్నారు. వారందరిని ఉద్దేశించి భవాని కోహ్లీ ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి వన్డేలో విరాట్ సెంచరీ చేశాడు. రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
విరాట్ సోదరి సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటుంది. తన సోదరుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. సోదరుడి విజయాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి అనుభూతిని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటుంది. విరాట్ కోహ్లీ ని ఎవరైనా విమర్శిస్తే భవాని ఏమాత్రం తట్టుకోలేదు.