ROKO: టీమ్ ఇండియా క్రికెట్లోనే కాదు.. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన జోడిగా పేరు ఉంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు. సమన్వయం అనేది వీరిద్దరి మధ్య అద్భుతంగా ఉంటుంది. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. కళాత్మకమైన డ్రైవ్ లు ఆడటంలో వీరికి వీరే సాటి. అందువల్ల వీరిద్దరిని విధ్వంసక వీరులు అని పిలుస్తుంటారు.
కెరీర్ చరమాంకంలో కూడా వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్లో రెండు డక్ ల తర్వాత హాఫ్ సెంచరీ తో టచ్ లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత స్వదేశంలో రాంచి వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొట్టాడు. ఒక హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన అతడు.. రాంచీలో అర్థ శతకాన్ని సాధించాడు.
రాంచీ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండో వికెట్ కు 106 బంతుల్లో 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అందువల్లే టీమిండియా 349 పరుగుల భారీ స్టోర్ చేయగలిగింది. వీరిద్దరూ 35 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నప్పటికీ ఒకప్పటి మాదిరిగానే బ్యాట్ ద్వారా విన్యాసాలు చేశారు.
ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా విరాట్, రోహిత్ తమ లయను అందుకున్నారు. అందువల్లే దక్షిణాఫ్రికా సిరీస్ ను ఘనంగా మొదలుపెట్టారు. రెండు సంవత్సరాల నుంచి సెంచరీ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ ద్వారా ఆ బాధను అధిగమించాడు. 11 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో అదరగొట్టాడు. తద్వారా కోహ్లీ తన కెరియర్ లో 52వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు..
రోహిత్ కూడా ప్రారంభంలో నిదానంగా ఆడాడు. ఆ తర్వాత జోరు చూపించాడు. వన్డేలలో 352 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది పేరు మీద ఉండేది. అతడు రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
రోహిత్, విరాట్ జోడికి అనేక రికార్డులు ఉన్నాయి. అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదు చేసి వీరు టీమిండియాను గెలిపించారు. అంతేకాదు సచిన్, ద్రావిడ్ (391 మ్యాచ్ లు) రికార్డు కూడా బ్రేక్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్ (392*)లు ఆడిన జోడిగా రికార్డు సృష్టించారు. వీరి జోరు ఇలానే కొనసాగితే 2027లో అత్యుత్తమమైన ద్వయంగా పేరు తెచ్చుకుంటారు. 2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో కనుక వీరిద్దరూ అదరగొడితే టీమిండియాకు ఇక తిరుగుండదు. ఆస్ట్రేలియా సిరీస్, ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభంలోనే వీరిద్దరూ దుమ్ము రేపుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ గురించి ప్రస్తావన వచ్చే అవకాశం లేదు.