https://oktelugu.com/

Pakistan cricket : ఇంతకు దిగజారిన తర్వాత.. పాకిస్తాన్ క్రికెట్ ఇంకేం బాగుపడుతుంది?

ఎప్పుడో 2021లో పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. బయటి దేశంలో దేవుడెరుగు.. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై సిరీస్ ఓటములు ఎదుర్కొంది. న్యూజిలాండ్ పై చచ్చీ చెడి సిరీస్ డ్రా చేసుకుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఏకంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ స్వదేశంలో టెస్ట్ విజయం సాధించక దాదాపు 1000 రోజులు పూర్తయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 8, 2024 / 04:39 PM IST

    Pakistan cricket team

    Follow us on

    Pakistan cricket : క్రికెట్లో హోమ్ టైగర్స్ అనే పేరు ప్రాచుర్యంలో ఉంటుంది. సొంత దేశంపై విపరీతమైన ప్రతిభ చూపే జట్టు.. విదేశాల్లో డీలా పడుతుంది అని అర్థం. ఈ రకంగా చూస్తే పాకిస్తాన్ కు ఆ పేరు కూడా సరిపోదు. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా సొంతమైదానాల్లో పాకిస్తాన్ ఒక్క సిరీస్ విజయాన్ని కూడా పొందలేకపోయింది. బాబర్, షహీన్ షా, నసీం షా, రిజ్వాన్, అఫ్రిది.. పేరుకు ఎంతో భీకరమైన లైనపు ఉన్నప్పటికీ.. మైదానంలో దిగడమే ఆలస్యం.. పాకిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్ పేకా మేడను తలపిస్తోంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

    వెయ్యి రోజులు దాటింది

    దక్షిణాఫ్రికా పై 2021 ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ టెస్ట్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేకపోయింది. దాదాపు వెయ్యి రోజులు పూర్తయినప్పటికీ పాకిస్తాన్ గెలుపు రుచిని చూడలేకపోయింది. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 10 మ్యాచ్ లను పాకిస్తాన్ ఆడింది. ఇందులో ఆరు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. నాలుగు మ్యాచ్ లను డ్రా చేసుకుంది. ఈ ట్రాక్ రికార్డు నేపథ్యంలో సొంత గడ్డపై అత్యంత దిక్కుమాలిన ఘనతను సాధించిన ఈ శతాబ్దపు చెత్త జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1990లో స్వదేశంలో పది టెస్టులకు పైగా ఆడి.. ఒకదాంట్లో కూడా విజయం సాధించకుండా న్యూజిలాండ్ అప్పట్లో చెత్త రికార్డు మూటకట్టుకుంది.. ఇప్పుడు ఆ స్థానాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది.

    రోజురోజుకు తీసికట్టు

    2019 -21 కాలంలో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 5వ స్థానంలో నిలిచింది. 2021-23 సంవత్సరంలో ఏడవ స్థానానికి పరిమితమైంది. అయితే ప్రస్తుతం ఆ జట్టు ఆట తీరు అత్యంత దారుణంగా మారింది.. గడచిన రెండున్నర సంవత్సరాలలో పాకిస్తాన్ బౌలర్ల మొత్తం యావరేజీ 37.90, బ్యాటర్ల స్ట్రైక్ రేట్ 65.9 అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ జట్టుతో సిరీస్ ఓటమి అనంతరం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ ఏకంగా ఎనిమిదో స్థానానికి దిగజారింది. 1965 తర్వాత పాకిస్తాన్ ఈ స్థాయిలో చెత్త ర్యాంకు సొంతం చేసుకోవడం ఇదే ప్రథమం. పాకిస్తాన్ తర్వాత స్థానాలలో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి జట్లు ఉన్నాయి.

    వరుస వైఫల్యాలు

    పాకిస్తాన్ జట్టు ఎంపికలో సమతౌల్యం ఉండడం లేదు. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడంతో కూర్పు భయ తప్పుతోంది. కొత్త, పాత ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఆటగాళ్లు మారుతున్న నేపథ్యంలో వ్యూహాలు అమలు కావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకం ఉండడం లేదు. స్థిరత్వాన్ని కోల్పోవడంతో పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ సర్వనాశనమైతోంది. దీనికి తోడు కెప్టెన్ల నిర్ణయాలు కూడా అత్యంత దారుణంగా ఉంటున్నాయి. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం బంగ్లాదేశ్ జట్టుకు ఆయాచిత వరం లాగా మారింది. సరైన ప్రణాళిక లేకపోవడం కూడా ఆ జట్టు విజయా అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.