Philip Hughes: ఫిలిప్ హ్యూస్.. ఆస్ట్రేలియా ఆటగాడు.. చిన్న వయసులోనే రికార్డులను నెలకొల్పాడు.. అయితే నవంబర్ 27న అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తూ.. కన్నుమూశాడు.. అతడి తలకు బంతి తగలడంతో.. చావుతో పోరాటం చేస్తూ ఓడిపోయాడు. అభిమానులను దుఃఖ సాగరంలో ముంచుతూ కన్నుమూశాడు. అతడి మరణం ఆస్ట్రేలియా జట్టుకు తీరనిలోటు. క్రికెట్ ప్రపంచానికి పూడ్చలేని వెలితి. నేడు ఫిలిప్ హ్యూస్ పదవ వర్ధంతి. సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా వేదికగా షే ఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో న్యూ సౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ బంతిని వేశాడు. పదునైన బౌన్సర్ సంధించాడు. ఆ బంతికి హ్యూస్ గాయపడ్డాడు. ఆ బంతి అతడికి తల వెనుక తగిలింది. దీంతో అతడు వెంటనే కుప్పకూలిపోయాడు. వెంటనే మైదానం సిబ్బంది అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదం జరిగిన అనంతరం హ్యూస్ రెండు రోజులపాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు. రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 27న అతని కన్నుమూశాడు. అతడు చనిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. చనిపోయింది ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ.. ప్రపంచం మొత్తం అతడికి నివాళులర్పించింది. గొప్ప క్రీడాకారుడిని క్రికెట్ ప్రపంచం కోల్పోయిందని క్రికెటర్లు తమ సంతాప సందేశాలలో పేర్కొన్నారు. ఆ బంతి అతడి ఆయువు పట్టు మీద తగలడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. చికిత్స పొందుతుండగానే అతడి అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు కన్నుమూశాడు.
కెరియర్ ఎలా సాగింది అంటే
చనిపోయే ముందు నాటికి హ్యూస్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే.. అతడు అప్పటికే 26 టెస్టులు ఆడాడు. మూడు సెంచరీలు చేశాడు. మొత్తంగా 1535 రన్స్ చేశాడు. వన్డేలలో అతడు రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. మొత్తంగా 826 పరుగులు సాధించాడు. హ్యూస్ 114 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. 26 సెంచరీలు చేశాడు. 9023 రన్స్ చేశాడు. లిస్ట్ ఏ లో హ్యూస్ 8 సెంచరీల సహాయంతో 3639 రన్స్ చేశాడు. అయితే హ్యూస్ కు ప్రమాదం జరిగింది సిడ్ని క్రికెట్ గ్రౌండ్లో.. దక్షిణ ఆస్ట్రేలియా, న్యూస్ సౌత్ వెల్స్ మధ్య జరిగిన పోటీలో అతడు పాల్గొన్నాడు. ఆ మ్యాచ్లో అతడు 63 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు..హ్యూస్ హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి.. అబౌట్ బౌలింగ్లో గాయపడ్డాడు. అంతిమంగా మరణించాడు.