https://oktelugu.com/

Ishaan Kishan – Shreyas Iyer : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కెరియర్ల కు ప్రమాదం పొంచి ఉందా?

ఇక ప్రస్తుత తరుణంలో కిషన్, అయ్యర్   సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకోవాలంటే అద్భుతమైన ప్రదర్శన చేయాలని సీనియర్ ఆటగాళ్లు సూచిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2024 / 07:37 PM IST
    Follow us on

    Ishaan Kishan – Shreyas Iyer : బీసీసీఐ 2023-24 కు సంబంధించి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు పెద్ద దుమారాన్ని లేపుతోంది. సెంట్రల్ కాంటాక్ట్ ప్రకటించి నాలుగు రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా వివాదం సద్దుమణగలేదు. ముఖ్యంగా కిషన్, అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు కోల్పోవడం పట్ల సీనియర్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటికే బీసీసీఐ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. “కొందరు ఆటగాళ్లకు ఆగ్ర తాంబూలం ఇస్తూ.. మరికొందరి ఆటగాళ్ళను కాంట్రాక్ట్ నుంచి తొలగించడం ఏమిటని” పఠాన్ ప్రశ్నిస్తున్నాడు.

    సెంట్రల్ కాంటాక్ట్ నుంచి పేర్లు తొలగించిన నేపథ్యంలో కిషన్, అయ్యర్ క్రీడా భవితవ్యమేమిటి? వారు ఇక ఎప్పటికీ కాంట్రాక్టు దక్కించుకోలేరా? వారు కాంట్రాక్టు దక్కించుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ కి పేరుంది. పైగా అది ఐసీసీ ని కూడా శాసిస్తోంది. అలాంటి బోర్డులో సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఉన్న కాంట్రాక్ట్ పోగొట్టుకోవడం అనేది ఒకింత ఇబ్బందికరమైన పరిణామం. ఈ సెంట్రల్ కాంటాక్ట్ కోసం ఆటగాళ్లు ఎంతో తాపత్రయ పడుతుంటారు.. యువ ఆటగాళ్లు అయ్యర్, కిషన్ కాంట్రాక్ట్ కోల్పోవడం పట్ల ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.. ఆట పరంగా కూడా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో వేతనాలు లభిస్తాయి. ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి ఏడు కోట్ల దాకా వస్తాయి. అంతేకాకుండా నేరుగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లొచ్చు. సమగ్ర బీమా రక్షణ కూడా ఉంటుంది. వైద్య ఖర్చులను బోర్డు భరిస్తుంది. ఒకవేళ గాయం కారణంగా ఐపీఎల్ లాంటి మెగాటోరి నుంచి తప్పుకుంటే భత్యాలు కూడా బీసీసీఐ చూసుకుంటుంది.

    సెంట్రల్ కాంటాక్ట్ లో చోటు కోల్పోవడం పట్ల పై ప్రయోజనాలను కిషన్, అయ్యర్ నష్టపోయారు. ఆటపరంగా కూడా వారికి అది కోలుకోలేని దెబ్బ. అయితే వాళ్లు టీమిండియాలో ఆడొచ్చు.. కానీ తమకు ఉన్న ప్రాధాన్యాన్ని కోల్పోతారు. ఇక వారు ఇటీవల చెప్పిన కారణాలను బీసీసీఐ పెద్దలు సెంట్రల్ కాంట్రాక్టుకు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గాయాలను కారణంగా చెప్పినప్పటికీ.. జై షా పట్టించుకోలేదని సమాచారం. అయితే గతంలో జై షా లేఖలు రాసినప్పటికీ అయ్యర్, కిషన్ లెక్కపెట్టలేదని తెలుస్తోంది. అందువల్లే వారికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కలేదని సమాచారం. మరోవైపు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు కొద్ది రోజులుగా ఆటకు దూరంగా ఉంటున్నప్పటికీ.. వారు ఎటువంటి ఆడకపోయినప్పటికీ వారికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు ఎలా ఇచ్చారని సీనియర్ ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు.. ఇక ప్రస్తుత తరుణంలో కిషన్, అయ్యర్   సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకోవాలంటే అద్భుతమైన ప్రదర్శన చేయాలని సీనియర్ ఆటగాళ్లు సూచిస్తున్నారు. మరి అయ్యర్, కిషన్ తదుపరి టోర్నీలో చూపించే ప్రతిభ ఆధారంగానే వారి భవితవ్యం ముడిపడి ఉంది.