Badminton : మనకు ఎన్నో క్రీడలు ఉన్నాయి.. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును పొందాయి. మనదేశంలో క్రికెట్ కి ఇచ్చే ప్రాముఖ్యత నేషనల్ స్పోర్ట్స్ అయినా హాకీ కి కూడా ఇవ్వడం లేదు అన్న విమర్శ ఎప్పుడూ ఉంది. అయితే ప్రస్తుతం ఇదే విమర్శ బ్యాడ్మింటన్ విషయంలో కూడా మొదలయ్యే పరిస్థితికి చేరుకుంది. 2021 టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ లో వచ్చిన మెడల్ తరువాత ఇప్పటివరకు బ్యాడ్మింటన్ లో భారత్ కి మరి ఎటువంటి మెడల్ రాలేదు. మెడల్స్ విషయం తీసి పక్కన పెడితే కనీసం ఫైనల్స్ వరకు అయినా వెళ్లడమే కష్టం అయిపోతుంది.
భారతదేశ బ్యాడ్మింటన్ చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ ప్రకాష్ పదుకొనే. 1980లో జరిగిన ప్రతిష్టాత్మక ఆల్ ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుని పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానానికి చేరిన మొదటి భారతీయుడు ఇతడే. ఒక్క ప్రకాష్ పదకొనే కాదు ఆ తరువాత ఎందరో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తమ పేర్లను శాశ్వతంగా నిలిచేలా పథకాలు గెలుచుకున్నారు.పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్,సయ్యద్ మోదీ , పారుపల్లి కశ్యప్ , అపర్ణ పోపట్ , జ్వాలా గుత్తా లాంటి ఎందరో క్రీడాకారులు బ్యాడ్మింటన్ లో తమ సత్తాను చాటారు.
ముఖ్యంగా కిదాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో రజిత పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందాడు.ప్రకాష్ పదుకొణె తరువాత భారత్ బ్యాడ్మింటన్ లో అగ్రస్థానంలో నిలిచిన ఏకైక భారతీయ ఆటగాడు ఇతడే. 2022లో కిదాంబి శ్రీకాంత్ గెలిచిన థామస్ కప్ తరువాత తిరిగి భారత్ ఖాతాలో మరి ఎటువంటి గెలుపు నమోదు కాలేదు. ఎందుకు అని ప్రశ్నించే ముందు ఇది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రికెట్ హవా నడుస్తుంది. ఎంతో కొంత క్రీడా స్ఫూర్తి ఉన్న ప్లేయర్స్ అందరూ క్రికెట్ నేర్చుకొని ఆ వైపు వెళ్లడానికే మక్కువ చూపుతున్నారు. కొంతమంది బ్యాడ్మింటన్ పై ఆసక్తి చూపినప్పటికీ వారికి అవసరమైనటువంటి సదుపాయాలను ప్రభుత్వం అందించలేకపోతోంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ను ఆశ్రయించి నేర్చుకున్న వాళ్లే ఎంతో కొంత ఈ ఫీల్డ్ లో నిలబడగలుగుతున్నారు కానీ మిగిలిన వారికి ఎటువంటి వసతులు లేవు. సెలక్షన్స్ విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం జరుగుతుంది.
ఒకరకంగా చెప్పాలి అంటే ఇండియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే స్పోర్ట్ క్రికెట్ మాత్రమే. ఈ పక్షపాతం వైఖరి మానుకునే వరకు మిగిలిన క్రీడల్లో క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించలేరు. నిధులు కేటాయింపు విషయంలో కూడా క్రికెట్కు ఒక లెక్క మిగిలిన స్పోర్ట్స్ కు ఇంకొక లెక్క అన్నట్లు ఉంటుంది ప్రభుత్వం వ్యవహారం. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని అన్ని క్రీడలను ఒకే దృష్టిలో చూసే విధి విధానాలను ప్రభుత్వం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే మనం అన్ని క్రీడల్లో రాణించగలం.