Nitish Kumar Reddy News: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నిజం కంటే అబద్ధాలే ఎక్కువ వ్యాప్తిలో ఉంటున్నాయి. దీంతో కొన్ని సందర్భాలలో ఈ తరహా అబద్ధాలు సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అవి రకరకాల పరిణామాలకు దారి తీస్తున్న నేపథ్యంలో చివరికి సెలబ్రిటీలు స్పందించక తప్పడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో టీమిండియా యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా చేరిపోయాడు.. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన అతడు.. రెండు టెస్టులు ఆడినప్పటికీ.. గాయం వల్ల నాలుగో టెస్టు ఆడలేకపోయాడు. దీంతో అతడు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు.. ఈలో గానే అతని సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో తెగ సందడి చేస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు నుంచి వెళ్లిపోతాడని.. హైదరాబాద్ యాజమాన్యం అతడిని వదిలేసుకుంటుందని.. అతడి స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం కల్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నితీష్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు.
Also Read: ఆసియా కప్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా?
“నా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట్లో వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆ ప్రచారాలు మరింత పెరుగుతున్నాయి. ఇక తప్పడం లేదు కాబట్టి సమాధానం చెప్పాల్సి వస్తోంది. వాటిపై స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది. నాకు హైదరాబాద్ అనేది సొంత జట్టు లాంటిది. ఆ జట్టుతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది. వచ్చే ఐపిఎల్ సీజన్లో నేను హైదరాబాద్ జట్టును వీడి పోతున్నాను అని అనడం నిజం కాదు. హైదరాబాద్ జట్టుతోనే నా ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దయచేసి అసత్య ప్రచారాలను చేయకండి” అంటూ నితీష్ పేర్కొన్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి కొన్ని సీజన్లుగా హైదరాబాద్ జట్టులో ఆడుతున్నాడు. హైదరాబాద్ జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్ యాజమాన్యంతో నితీష్ కుమార్ రెడ్డికి మంచి బాండింగ్ ఉంది. గత సీజన్లో నితీష్ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. మేనేజ్మెంట్ అతనిపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచింది. వచ్చే సీజన్లో కూడా నితీష్ ఆడతాడని.. అందులో అనుమానం లేదని ఇప్పటికే మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు నితీష్ కూడా స్పష్టత ఇవ్వడంతో ఒకసారిగా ఆ ప్రచారాలు, ఆ వార్తలు నిరాధారమని తేలిపోయింది.
Also Read: పహల్గాం రక్తం తాగిన పాకిస్తాన్ తో క్రికెటా? బీసీసీఐ ఏంటిది?
కొంతకాలంగా హైదరాబాద్ జట్టు నితీష్ ను లోయర్ ఆర్డర్లో పంపిస్తోంది.. అందువల్లే అతడు మేనేజ్మెంట్ పై ఆగ్రహం గా ఉన్నాడని.. దానివల్లే జట్టు మారబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు హైదరాబాద్ జట్టు యాజమాన్యం గాని.. నితీష్ కుమార్ రెడ్డి గాని అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై రెండువైపులా నిశ్శబ్దం ఉందంటే కచ్చితంగా ఏదో జరుగుతోందని కొంతమంది అంచనా వేశారు. ఇంకేముంది దానికి మసాలా అద్ది రకరకాలుగా ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. చివరికి నితీష్ కుమార్ రెడ్డి జట్టు మారుతున్నాడు అని స్పష్టత ఇచ్చారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి స్పందించక తప్పలేదు.