Homeక్రీడలుIRE Vs BAN 3rd ODI: నాలుగు పరుగుల దగ్గర ఆగిపోయింది గానీ.. లేకుంటే ఐర్లాండ్...

IRE Vs BAN 3rd ODI: నాలుగు పరుగుల దగ్గర ఆగిపోయింది గానీ.. లేకుంటే ఐర్లాండ్ బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చేదే!

IRE Vs BAN 3rd ODI: క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు..మరీ ముఖ్యంగా వన్డే క్రికెట్లో అయితే నిమిష నిమిషానికి ఫలితాలు మారిపోతూ ఉంటాయి.. అలాంటి మ్యాచ్ బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగింది.. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఐర్లాండ్ లో బంగ్లాదేశ్ పర్యటిస్తోంది.. తొలి వన్డే వర్షం వల్ల రద్దయింది. రెండవ వన్డేలో ఐర్లాండ్ 300కు పైగా పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టుకు షాక్ ఇచ్చింది. అయితే బౌలింగ్ లోపం వల్ల ఆ స్కోరును కాపాడుకోలేకపోయింది. అయితే మూడవ వన్డేలో ఆ ఫలితం పునరావృతం కాకుండా జాగ్రత్త పడింది. కానీ నాలుగు పరుగుల దూరంలో విజయం వద్ద చతికల పడింది. లేకుంటే వన్డే క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదు అయ్యేదే.

274 వద్ద ఆల్ ఔట్

మూడో వన్డేలో భాగంగా తొలుత టాస్ గెలిచి ఐర్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 18 పరుగుల వద్ద మార్క్ అడైర్ బౌలింగ్లో రోనీ తాలుక్దార్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ నిదానంగా ఆడుతూ వచ్చింది. జట్టు స్కోర్ 67 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రమాదకరంగా మారిన శాంటోను క్రెయిగ్ యంగ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత లిట్టన్ దాస్, తమీమ్ ఐర్లాండ్ బౌలింగ్ ను కాచుకుంటూ పరుగులు తీశారు. మూడో వికెట్ కు 70 పరుగులు జోడించారు. ఈ దశలో లిటన్ దాస్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత తౌహీద్ హృదయ్, తమీమ్, ముష్ఫికర్ రహీం, హాసన్ రాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్, మృత్యుజయ్ చౌదరి వంటి వారు ఆడటంతో బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. వీరిలో తమీమ్ 69, రహీమ్ 45, మిరాజ్ 37 పరుగులు చేసి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ నాలుగు, మెక్ బ్రెయిన్, డాక్రెల్ చెరో రెండు వికెట్లు తీశారు.

నాలుగు పరుగుల దూరంలో

రెండో వన్డేలో 300 పైగా స్కోర్ సాధించిన ఐర్లాండ్ జట్టు.. మూడో వన్డేలో బంగ్లాదేశ్ విధించిన 274 పరుగుల లక్ష్యాన్ని చేదించాలని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. తొలి వికెట్ 17 పరుగుల వద్ద కోల్పోయినప్పటికీ.. రెండో వికెట్ కు స్టిర్లింగ్, బల్ బౌర్ని జోడీ ఏకంగా 119 పరుగులు జోడించింది.. వీరిద్దరి ఆట తీరు చూస్తే ఐర్లాండ్ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే బల్ బౌర్ని అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత జట్టు స్కోర్ 142 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్టిర్లింగ్ కూడా అవుట్ కావడంతో బంగ్లాదేశ్ శిబిరంలో హర్షం వ్యక్తం అయింది. అయితే హ్యారీ టెక్టర్, టక్కర్ కుదురుగా ఆడారు. నాలుగో వికెట్ కు 79 పరుగులు జోడించారు. టెక్టర్ ఔట్ అయిన తర్వాత ఇక ఐర్లాండ్ జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ వెన్ను మాత్రం చూపలేదు. చివరి వరకు పోరాడింది. చివర్లో అడైర్ పది బంతుల్లో 20 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది.. లేకుంటే 1_1 తో సిరీస్ సమం అయ్యేది. ఇక ఈ విజయంతో 2_0 తేడాతో బంగ్లాదేశ్ సిరీస్ దక్కించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా శాంటో నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను రహ్మాన్ దక్కించుకున్నాడు.. ఇక ఈ సిరీస్ విజయంతో బంగ్లాదేశ్ ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో ఏడవ స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ జట్టు 11వ స్థానానికి దిగజారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular