IPL Final GT Vs CSK 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ విజేత ఎవరో ముందుగానే నిర్ణయించారా..? అంటే అవునన్నా సమాధానమే పలువురు అభిమానుల నుంచి వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అయితే, అనూహ్యంగా అహ్మదాబాద్ లోని ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్ అంటూ డిస్ ప్లే చేయడంతో ఈ మ్యాచ్ పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐపీఎల్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ను నేరుగా చూసేందుకు వేలాదిమంది అభిమానులు టికెట్లు తీసుకుని గుజరాత్ లోని ప్రధాన మోడీ స్టేడియానికి చేరుకోగా, కోట్లాదిమంది అభిమానులు టీవీల్లో వీక్షించేందుకు ఆశగా నిరీక్షిస్తున్నారు. తమ తమ జట్లే విజయాలు సాధిస్తాయి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఆదివారం వర్షం కురవడంతో మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
హోరాహోరీగా పోరు.. విజేతగా ఎవరో..
గుజరాత్ – చెన్నై జట్ల మధ్య జరగనున్న పోరు ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరు జట్లు బలంగానే ఉండడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నాలుగు సార్లు ట్రోఫీ గెలుచుకుని ఐదోసారి గెలవడమే లక్ష్యంగా చెన్నై జట్టు బరిలోకి దిగుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్ లో ట్రోఫీ గెలిచి ముంబై ను సమం చేయాలని చెన్నై జట్టు భావిస్తోంది. అలాగే, ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి ఏడాదే గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచి అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా గుజరాత్ జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్ వరకు చేరుకుంది. దీంతో మొదటి ఏడాది తాము సాధించిన విజయం ఆషామాషీగా వచ్చింది కాదని, ఛాంపియన్ ఆట తీరుతోనే సాధ్యమైంది అన్న విషయాన్ని మరోసారి మిగిలిన జట్లకు ఈ ఏడాది ఆట తీరుతో రుజువు చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు. ఈ ఏడాది కూడా ఫైనల్ లో విజయమే లక్ష్యంగా ఈ జట్టు బరిలోకి దిగుతోంది. గుజరాత్ జట్టు విజయం సాధిస్తే వరుసగా రెండో ఏడాది టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా నిలుస్తుంది.
రన్నరప్ చెన్నై.. కలవరానికి గురి చేస్తున్న డిస్ ప్లే..
ఆదివారం రాత్రి జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ ఆడించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో నిరీక్షించిన నిర్వాహకులకు నిరాశే ఎదురైంది. వర్షం ఎప్పటికీ తగ్గకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మ్యాచ్ జరుగుతుందన్న ఉద్దేశంతో అభిమానులు వెనుదిరుగుతున్న సమయంలో.. చెన్నై జట్టు అభిమానులను కలవరానికి గురి చేసే ఒక విషయం స్టేడియంలో కనిపించింది. మ్యాచ్ జరగాల్సిన నరేంద్ర మోడీ స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై.. ‘ రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ ‘ అని పడడంతో గుజరాత్ టీమ్ గెలవబోతోందని అభిమానులు అనుమానిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయినట్లు ఉందని పలువురు సామాజిక మాధ్యమాల్లో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు కొట్టి పారేస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల స్క్రీన్ పై అలా వచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికీ అభిమానులను వేధిస్తున్న అనుమానం..
సాంకేతిక సమస్య వల్ల స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై అలా డిస్ ప్లే అయిందని నిర్వాహకులు చెబుతున్నా.. చెన్నై జట్టు అభిమానులను మాత్రం ఒక అనుమానం ఇప్పటికీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయిందని, అందులో భాగంగానే తుది ఫలితాన్ని మ్యాచ్ రద్దు అయిందన్న విషయం మర్చిపోయి డిస్ ప్లే చేశారని పలువురు పేర్కొంటున్నారు. ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయితే మాత్రం అభిమానుల నుంచి తీవ్రమైన నిరాశను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. మ్యాచ్ ఫిక్స్ చేస్తే ఐపీఎల్ పట్ల అభిమానులకు ఉన్న నమ్మకం పోతుందని, ఇది మొత్తంగా టోర్నమెంట్ పై ప్రభావం చూపించే అవకాశం భవిష్యత్ లో ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ సోమవారం జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచిన మ్యాచ్ ఫిక్స్ అయిందని అనుమానం అభిమానులను వెంటాడే అవకాశం ఈ చిన్న తప్పిదం కారణంగా కనిపిస్తోంది.