IPL 2026: ఐపీఎల్ లో గత ఏడాది విజేతగా నిలిచింది బెంగళూరు జట్టు. ట్రోఫీ ని గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో విజయ యాత్ర నిర్వహించింది. ఈ క్రమంలో అభిమానులు భారీగా రావడంతో మైదానంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 11మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం తీవ్రమైన అపప్రదను మూట కట్టుకోవాల్సి వచ్చింది.
కేసులు నమోదు కావడంతో బెంగళూరు జట్టు యాజమాన్యానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అరెస్టయ్యారు. ప్రభుత్వం కూడా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చనిపోయిన వారికి.. గాయపడిన వారికి బెంగళూరు యాజమాన్యం పరిహారం చెల్లించింది. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలా? వద్దా? అనే చర్చ కూడా జరిగింది. చివరికి బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ స్టేడియం మొత్తాన్ని పరిశీలించింది. మ్యాచ్ ల నిర్వహణకు ఆమోదముద్ర వేయడంతో.. బెంగళూరు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అంతేకాదు ఐపీఎల్ తొలి దశలో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో కొన్ని మ్యాచ్లు ఆడబోతోంది.
ఐపీఎల్ మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు 11 సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్ణయించింది. తొక్కిసలాట జరిగినప్పుడు 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. వారికి నివాళిగా ఈ 11 సీట్లను ఖాళీగా ఉంచుతామని మేనేజ్మెంట్ ప్రకటించింది. అంతేకాదు బెంగళూరు ఈ ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్లేయర్లు 11 నెంబర్ జెర్సీ ధరిస్తారు.. తద్వారా చనిపోయిన 11మంది ప్లేయర్లకు నివాళులర్పిస్తారు.
నాడు విజయ యాత్ర జరుగుతున్నప్పుడు భారీగా అభిమానులు దూసుకు వచ్చారు. ఏర్పాట్లను చేయడంలో బెంగళూరు యాజమాన్యం పూర్తిగా చేతులెత్తేసింది. భారీగా అభిమానులు రావడంతో పోలీసులు ఒక గేటును మాత్రమే తెరిచారు. ఫలితంగా విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో 11 మంది అభిమానులు చనిపోయారు. ఈ ఘటన బెంగళూరు ఐపీఎల్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.
