Nita Ambani : ఢిల్లీ జట్టుపై 59 రన్స్ వ్యత్యాసంతో ముంబై గెలిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సుస్థిరం చేసుకుంది. ముంబై జట్టు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయినప్పటికీ దాంతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. గత కొద్ది సీజన్లు గా ముంబై జట్టు అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నది. ఐదుసార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచినప్పటికీ.. కొంతకాలంగా ఆ జట్టు ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. అంతటి రోహిత్ ఆధ్వర్యంలో కూడా ముంబై జట్టు చెప్పుకునే స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేకపోయింది. అందువల్లే గత సీజన్లో రోహిత్ శర్మ స్థానాన్ని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం మార్చేసింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. హార్దిక్ పాండ్యాను నియమించిన గత సంవత్సరం ముంబై జట్టు అంతగా ఆకట్టుకునే స్థాయిలో ఆడలేదు. గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్ళిపోయింది. దీనికి తోడు జట్టులో నెలకొన్న విభేదాలు పరువు తీశాయి. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ వర్గాలుగా ఆటగాళ్లు విడిపోయారు. ఇక అభిమానులైతే చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో వారు చేసిన రచ్చ తారస్థాయికి చేరేది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ వెళ్లిపోవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతోపాటు ముంబై జట్టు సహ యజమాని నీతా అంబానీ కూడా మైదానంలో విపరీతంగా సందడి చేశారు.
ఉత్కంఠగా సాగిన మ్యాచులు ముంబై గెలిచిన తర్వాత నీతా అంబానీ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి వెళ్లిన నీతా.. అప్పటికప్పుడు ముంబై ప్లేయర్లకు శానిటైజర్ ఇచ్చారు. చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.. ఆమె చేసిన సూచనల ప్రకారం ముంబై ప్లేయర్లు కూడా అలాగే చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి మొదలు పెడితే తిలక్ వర్మ వరకు ప్రతి ఒక్కరు తమ చేతులను శానిటైజ్ చేసుకున్నారు. అయితే ఆటగాళ్లకు స్వయంగా నీతా అంబానీ శానిటైజర్లు ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కొంతకాలంగా ఆసియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలో కూడా యాక్టివ్ కేసులు 120+ కి మించి ఉన్నాయి. ఇక ఇటీవల ముంబైలో ఆసుపత్రిలో ఇద్దరు కరోనాతో చనిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వారికి కరోనా కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
Also Read : మేం అలా చేస్తున్నాం కాబట్టే.. క్రికెట్లో టీమిండియా ఈ స్థాయిలో ఉంది.. నీతా అంబానీ సంచలన వ్యాఖ్యలు..
ఇక ఆసియావ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కీలక సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ తమ జట్టు ప్లేయర్లకు శానిటైజర్లు అందించారు. అన్నట్టు ఇటీవల హైదరాబాద్ జట్టు చెందిన కీలక ఆటగాడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ కు అతడు పూర్తిగా దూరమయ్యాడు. ముంబై జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లిన నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్యం బాగుండాలని నీతా అంబానీ శానిటైజర్లు అందించారు. ఆటగాళ్ల ఆరోగ్యం కోసం నీతా అంబానీ పడుతున్న తాపత్రయం నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.