https://oktelugu.com/

IPL 2024 playoffs : హైదరాబాద్ తో పాటు.. బెంగళూరు ప్లే ఆఫ్ కు.. ఎలాగంటే..

అంతేకాదు చెన్నై జట్టుతో తలపడే మ్యాచ్లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకోవాలి. లేదా చెన్నై విధించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేదించాలి. అప్పుడే బెంగళూరుకు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2024 / 06:20 PM IST

    IPL 2024: Six teams battle for three berths in IPL playoffs

    Follow us on

    IPL 2024 playoffs : ఐపీఎల్ 17వ సీజన్ అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. అంతకుమించిన ఉత్కంఠను కూడా కలగజేస్తోంది. ఈసారి ఐపీఎల్లో పేరుపొందిన జట్లు త్వరగానే నిష్క్రమించాయి. ఎటువంటి అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభం ముందు క్రీడా విశ్లేషకులు కోల్ కతా జట్టును పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అది ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. రాజస్థాన్ కూడా అంతే.. అది ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. చివరికి బెంగళూరు కూడా.. మొదటి స్పెల్ లో బెంగళూరు వరుస ఓటములు ఎదుర్కొంది. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. పాయింట్ల పట్టికలో ఏకంగా 5వ స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆశలను కూడా సజీవంగా ఉంచుకుంది. అద్భుతం జరిగితే బెంగళూరు కూడా ప్లే ఆఫ్ వెళ్లిపోయే అవకాశం కొట్టి పారేయలేనిది.

    హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడగా.. ఏడింట్లో విజయాన్ని దక్కించుకుంది.. మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. గుజరాత్, పంజాబ్ జట్లతో జరిగే మ్యాచ్లలో ఆ జట్టు గెలిస్తే.. ప్రస్తుతం ఉన్న నెట్ రన్ రేట్ ( +0.406) ప్రకారం ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్లో గెలిచి.. రెండో మ్యాచ్లో ఓడిపోతే.. ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ .. ఇటీవల జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఏకంగా మూడవ స్థానానికి వెళ్లిపోయింది. అయితే చెన్నై జట్టు రాజస్థాన్ పై విజయం సాధించడంతో, నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై మూడో స్థానానికి వెళ్లిపోయింది. హైదరాబాద్ నాలుగో స్థానానికి వచ్చింది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ గుజరాత్, పంజాబ్ జట్లపై విజయం సాధించడం పెద్ద విషయం కాదు.

    ఇక బెంగళూరు విషయానికొస్తే.. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడి.. ఆరింట్లో విజయాన్ని దక్కించుకుంది. ప్లే ఆఫ్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో.. బెంగళూరు అభిమానులు కచ్చితంగా కప్ గెలుస్తుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో బెంగళూరు ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెడుతున్నారు. బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్ళాలంటే హైదరాబాద్, లక్నో, ఢిల్లీ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాలి. అంతేకాదు చెన్నై జట్టుతో తలపడే మ్యాచ్లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకోవాలి. లేదా చెన్నై విధించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేదించాలి. అప్పుడే బెంగళూరుకు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.