IPL 2024 LSG vs RR : ఐపీఎల్ లో ఈసారి కప్ గెలిచే జట్టు ఏదంటే.. నిన్నటి వరకు విశ్లేషకులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్ కతా జట్ల పేర్లు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో వారు రాజస్థాన్ ను కూడా చేర్చుకుంటారు. ఎందుకంటే ఆదివారం ఆ జట్టు ఆడిన ఆట అలా ఉంది మరి. ఎటువంటి అంచనాలు లేకుండా మైదానంలోకి దిగిన ఆ జట్టు అద్భుతమే చేసింది. ఆ జట్టు కెప్టెన్ సంజు సాంసన్(82) వీరోచిత బ్యాటింగ్, బౌల్డ్ (రెండు వికెట్లు) అద్భుతమైన బౌలింగ్ తో లక్నో జట్టుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు కు రియాన్ పరాగ్(43) తోడు కావడంతో రాజస్థాన్ స్కోర్ రాకెట్ లాగా దూసుకెళ్లింది. లక్నో ముందు 194 రన్స్ టార్గెట్ పెట్టింది.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లు ఆడి, ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసింది. లక్నో జట్టులో పురన్(64; 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), కేఎల్ రాహుల్(58; 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లు) దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పురన్, రాహుల్ ఐదో వికెట్ కు ఏకంగా 85 పరుగులు జోడించారు. అయినప్పటికీ ఓటమి నుంచి లక్నో జట్టు తప్పించుకోలేకపోయింది.
194 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టును రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ వణికించాడు. తొలి ఓవర్ ఐదో బంతికి క్వింటన్ డికాక్ ను అవుట్ చేశాడు. దేవదత్ పడిక్కల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆయుష్ బదోని ని బర్గర్ చేశాడు. దీంతో లక్నో జట్టు 11 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయింది. దీపక్ హుడా(26) వేగంగా ఆడే క్రమంలో యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ దశలో పురన్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. ఒకానొక దశలో లక్నో గెలిచేలాగే అనిపించినప్పటికీ రాహుల్, స్టోయినిస్ వికెట్లు తొమ్మిది పరుగుల వ్యవధిలోనే కోల్పోవడంతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజూకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవడానికి ప్రధాన కారణం సంజు కెప్టెన్సీ. సందీప్ శర్మకు బదులుగా బౌల్ట్ కు ఓపెనింగ్ బౌలింగ్ వేసే అవకాశం ఇచ్చాడు. బౌల్ట్ కూడా కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి ఓవర్ ఐదో బంతికే డికాక్ వికెట్ పడగొట్టాడు. మూడవ రెండో బంతికి పడిక్కల్ ను అవుట్ చేసి రాజస్థాన్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇక అప్పటినుంచి దీపక్ వికెట్ పడేంతవరకు రాజస్థాన్ బౌలర్లు లక్నోపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. పురన్ గట్టిగా నిలబడకపోయి ఉంటే లక్నో 140 లోపే ప్యాక్ అయ్యేది. అయినప్పటికీ రాహుల్ – పురన్ ను విడదీసేందుకు సంజు అనేక ప్రయత్నాలు చేశాడు. బౌలర్లతో మార్చి మార్చి బౌలింగ్ చేయించాడు. చివరికి 16.1 ఓవర్ వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో రాహుల్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతిలోకి వచ్చింది. ఒకానొక దశలో పురన్ మ్యాచ్ గెలిపించేలా ఉన్నప్పటికీ.. సంజు తన ఎత్తులతో లక్నో జట్టును కోలుకోకుండా చేశాడు. ఇక ఈ విజయంతో ఐపీఎల్ 17వ సీజన్ ను రాజస్థాన్ ఘనంగా ప్రారంభించింది. రాజస్థాన్ విజయం కీలక పాత్ర పోషించిన సంజును నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ” అతనికి అన్ని సామర్థ్యాలు ఉన్నప్పటికీ బీసీసీఐ అవకాశాలు ఇవ్వలేదు. ఏవో సాకులు చూపి పక్కన పెట్టింది. అతనికి చాలా గాయాలు చేసింది. కానీ అతడేమో ఖాయంగా దేవుడయ్యాడు. రాజస్థాన్ జట్టును గెలిపించాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. అతడి ఆట తీరును పుష్ప సినిమాలోని డైలాగులతో పోల్చుతున్నారు.