IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. బీసీసీఐ కూడా ఈసారి టోర్నీని మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు జట్లు రకరకాల ప్రణాళికలు అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా సరే కప్ దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కీలకమైన సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ యజమాన్యానికి అతడు వెల్లడించాడు. స్టెయిన్ 2022 నుంచి సన్ రైజర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది సీజన్లో హైదరాబాద్ పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(SA-t20) టి20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు కు మార్క్ రమ్ వరుసగా రెండు సీజన్లలో ట్రోఫీలు అందించాడు. కానీ అతడు ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోతున్నాడు.
స్టెయిన్ వెళ్లిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ సీజన్లో కొత్త కెప్టెన్ గా ప్యాడ్ కమిన్స్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో హైదరాబాద్ జట్టు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరిస్తుందని తెలుస్తోంది..మార్క్రమ్ జట్టును విజయవంతంగా నడిపించ లేకపోతుండడంతో హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కమిన్స్ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో సమర్థవంతంగా రాణించగలడు. అతని కోసం హైదరాబాద్ జట్టు ఏకంగా 20. 50 కోట్లు ఆఫర్ చేసింది.
కొత్త కెప్టెన్ మాత్రమే కాక.. కొత్త బౌలింగ్ కోచ్ ను కూడా హైదరాబాద్ జట్టు నియమించే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం కొత్త బౌలింగ్ కోచ్ కోసం హైదరాబాద్ జట్టు తెగ ప్రయత్నాలు చేస్తోంది. టోర్నీ ప్రారంభమయ్యే నాటికి కోచ్ దొరకకపోతే ప్రస్తుతం ప్రధాన కోచ్ గా కొనసాగుతున్న డేనియల్ వెటోరిపై ఆ భారం కూడా పడే అవకాశం ఉంది. గత ఏడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని తెగ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది.
ఆటగాళ్లు వీరే
మార్క్రమ్(కెప్టెన్ ప్రస్తుతానికి), సుబ్రహ్మణ్యన్, ఆకాష్ మహారాజ్ సింగ్, జయదేవ్, ప్యాట్ కమిన్స్, హసరంగ, హెడ్, ఫరూఖీ, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, జాన్సన్, అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్, అన్మోల్ ప్రీత్ సింగ్, క్లాసన్, ఫిలిప్స్, రాహుల్ త్రిపాటి, అబ్దుల్ సమద్.