IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ ప్రారంభం కాకముందే చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. చెన్నై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించి విజయవంతమైన జట్టుగా మార్చాడు. అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకొని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. అయితే ఈ కెప్టెన్సీ మార్పుపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో ఆసక్తికరంగా మారాయి.
కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్టు ధోని తమకు కూడా ఈరోజే చెప్పాడని.. ఐపీఎల్ ట్రోఫీ ఫోటోషూట్ కు కొంత సమయం ముందే తమకు ఈ విషయం తెలుసని ఆయన వెల్లడించాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని తాను ఊహించలేదయ్యా అంటూ కాశీ విశ్వనాధ్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు..”ధోని సమర్థవంతమైన నాయకుడు. అతడు జట్టు కోసం ఏదైనా చేస్తాడు. అతడి నిర్ణయాన్ని అంగీకరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. రెండు సంవత్సరాల క్రితం జడేజా పై మేం చేసిన ప్రయోగం విఫలమయింది. ఈసారి తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుందని” కాశీ విశ్వనాథ ప్రకటించాడు.
ధోని ఎలాంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకుంటాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడం, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడం. టి 20 క్రికెట్ నుంచి తప్పుకోవడం.. వాటి నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకున్నవే. తాజాగా చెన్నై జట్టు నాయకత్వ బాధ్యతలను వదులుకోవడం కూడా ఆ కోవకే చెందుతాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత.. ధోని చెన్నై విషయంలో ఎటువంటి పాత్ర పోషిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పడాలంటే.. ధోని నోరు విప్పాలి.