IPL 2022: ఐపీఎల్ 2022 అంచనాలకు విభిన్నంగా సాగుతోంది. ఫేవరెట్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అడుగున కొనసాగుతున్నాయి. అయితే టీమ్ బాగోలేదని భావించిన సన్‌రైజర్స్ టీమ్ మాత్రం అనూహ్య ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్‌లో ఉంది. వేలంలో కోట్లు ఖర్చు చేసిన టీమ్స్ డీలా పడిపోయాయి. ఖరీదైన ఆటగాళ్లుగా భావించిన వాళ్లు ఫ్రాంచైజీలకు భారంగా మారారు.
కొంతమంది ఆటగాళ్లు చెత్తప్రదర్శన చేస్తుండటంతో ఆయా ఫ్రాంచైజీలు వారిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ ప్లేయస్ ఒడియన్ స్మిత్ ఉన్నాడు. అతడిని పంజాబ్ రూ.6 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన స్మిత్ కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతడిని ఫ్రాంచైజీ జట్టు నుంచి తప్పించింది.
Also Read: Beast Vs KGF 2: తమిళనాడు లో బీస్ట్ కలెక్షన్స్ ని దాటేసిన KGF చాప్టర్ 2.. విజయ్ కి ఇది ఘోరమైన అవమానం
వేలంలో ఎక్కువగా ఖర్చుపెట్టని సన్‌రైజర్స్ హైదరాబాద్ అబ్దుల్ సమద్ కోసం ఏకంగా రూ.4 కోట్లు ఖర్చుపెట్టింది. అయితే అతడు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టులో సమద్ ప్లేస్ గల్లంతైంది. అటు దేశవాళీ మ్యాచ్‌లలో అదరగొట్టిన షారుఖ్‌ఖాన్ కోసం పంజాబ్ జట్టు వేలంలో రూ.9 కోట్లు ఖర్చు చేసింది. తీరా మైదానంలో అతడు పెద్దగా రాణించిందేమీ లేదు. 7 మ్యాచ్‌లలో 98 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
మరోవైపు ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వేలంలో రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 4 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో తదుపరి మ్యాచ్‌కు అతడిని కోల్‌కతా యాజమాన్యం తుది జట్టు నుంచి తొలగించింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని చెన్నై జట్టు ఎంతో నమ్మకంతో రిటైన్ చేసుకుంది. కానీ అతడు ఐదు మ్యాచ్‌లు ఆడి బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనూ 87 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో జట్టు నుంచి తొలగించి న్యూజిలాండ్ బౌలర్ సాట్నర్ ను అతడి స్థానంలో ఆడిస్తోంది.
అటు సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్‌ను ముంబై జట్టు భారీ అంచనాల నడుమ రూ.8 కోట్లతో మెగా వేలంలో సొంతం చేసుకుంది. అయితే అతడు ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 13 పరుగులు చేసి విఫలం కావడంతో అతడి ప్లేస్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో గల్లంతైంది.
ఇలా కోట్లు పోసి కుమ్మరించిన ఆటగాళ్లంతా తేలిపోతుంటే.. తక్కువకు కొనుగోలు చేసిన తిలక్ వర్మ లాంటి వారు ముంబై తరుఫున అదరగొడుతున్నారు. ఇక తక్కువే కొన్న సన్ రైజర్స్ తరుఫున జానెసెన్, మార్కమ్ లాంటి వారు అనూహ్యంగా చెలరేగుతూ టీంలను గెలిపిస్తున్నారు.ఇలా ఓడలు బండ్లు, బండ్లు ఓడలైన పరిస్థితి ఈ ఐపీఎల్ లో కనిపిస్తోంది. ఇది వాళ్ల టీంలను ఓడిపోయేలా చేస్తోంది.
Also Read:Devotional Tips: ఏ గుడికి ఏ సమయంలో వెళితే మంచి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?