
ఆటలు, సినిమాల విషయంలో అభిమానులకు కొన్ని విశ్వాసాలు ఉంటాయి. గతం తాలూకు పొడ వర్తమానంలో కనిపిస్తే చాలు.. భవిష్యత్ పై లెక్కలు కట్టేసి.. ఇలా జరగొచ్చని, జరిగే ఛాన్స్ ఉందని, జరిగితే బాగుంటుందని.. అంచనాల్లో, ఆశల్లో మునిగి తేలుతుంటారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలోనూ అలాంటి పరిస్థితే వచ్చింది. దీంతో.. అభిమానులంతా ఐదేళ్ల గతానికి వెళ్లిపోయి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
2021 సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికి రెండు మ్యాచులు ఆడింది. ఆడిన రెండూ ఓడిపోయింది. ఇప్పుడు మూడో మ్యాచ్ కు సిద్దమైంది. ఈ లెక్కలే అభిమానులను ఉద్విగ్నానికి గురిచేస్తున్నాయి. మరి, ఆ లెక్కలేంటో మనమూ చూసేద్దాం.
2016 సీజన్లో సన్ రైజర్స్ జట్టు విజేతగా నిలిచింది. అయితే.. ఆ సీజన్ ప్రారంభానికి ముందు హైదరాబాద్ జట్టు కప్పు గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సన్ రైజర్స్ హాట్ ఫేవరెట్ జట్టేమీ కాదు. 2016లో మొదటి మ్యాచ్ ఓడిపోయింది. రెండో మ్యాచ్ కూడా ఓటమిపాలైంది. ఇప్పుడు 2021 సీజన్లోనూ మొదటి రెండు మ్యాచులు ఓడిపోయింది.
అంతేకాదు.. మొదటి రెండు మ్యాచులు 2016లో బెంగళూరు, కోల్ కతా మీదనే ఓడిపోయింది. ఈ సారి కూడా ఈ రెండు జట్లతోనే ఆడింది. ఓడింది. ఇంకో లెక్క ఏమంటే.. ఆ సీజన్లో మూడో మ్యాచ్ ముంబైతో ఆడి, గెలిచింది. ఈ సీజన్లో కూడా మూడో మ్యాచ్ ముంబైతోనే ఆడాల్సి ఉంది.
కాబట్టి.. ముంబైతో మ్యాచ్ గనుక గెలిస్తే.. ఇక కప్పు వేటలో జట్టు పడిపోవడం ఖాయం. సాధించడమూ కన్ఫామ్ అన్నది అభిమానుల ఆస్ట్రాలజీ. గ్యారెంటీ ఏంటని లాజిక్కులు అడక్కండి. అభిమానులు కదా.. వాళ్లకు మ్యాజిక్కులే కావాలి. మరి, ఫ్యాన్స్ ఆశిస్తున్నట్టుగా ముంబైతో మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.